Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, కన్న కొడుకుని హత్య చేసి ముక్కలుగా నరికిన తల్లి-prakasam district crime mother kills son cuts body into pieces police arrested two ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, కన్న కొడుకుని హత్య చేసి ముక్కలుగా నరికిన తల్లి

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, కన్న కొడుకుని హత్య చేసి ముక్కలుగా నరికిన తల్లి

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 14, 2025 10:25 PM IST

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకును తల్లి, మరో వ్యక్తి సాయంలో హత్య చేసింది. ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి గోనె సంచుల్లో కుక్కి పంటకాలవలో పడేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రకాశం జిల్లాలో దారుణం, కన్న కొడుకుని హత్య చేసి ముక్కలుగా నరికిన తల్లి
ప్రకాశం జిల్లాలో దారుణం, కన్న కొడుకుని హత్య చేసి ముక్కలుగా నరికిన తల్లి

Prakasam Crime : హైదరాబాద్ లోని మీర్ పేట్ లో భార్యను చంపి ముక్కలుగా చేసిన ఘటన మురువగా ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా కంభంలోని తెలుగు వీధిలో కన్న కొడుకును తల్లి ఓ ఆటో డ్రైవర్ సాయంతో హత్య చేసింది. హత్య తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కుక్కి మేదర బజారు సమీపంలోని పంట కాలువలో పడేశారు. గోనె సంచుల్లో శరీర భాగాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏపీలో దారుణం

ప్రకాశం జిల్లా కంభంలోని తెలుగు వీధిలో కదం శ్యామ్(35) అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. శ్యామ్ శరీరాన్ని ముక్కలు నరికారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మూడు గోనె సంచుల్లో కుక్కి మేదర బజార్ సమీపంలోని పంట కాలువ పడేశారు. ఈ ఘటనలో కన్న తల్లి సాలమ్మ హత్య చేసిందని శ్యామ్ సోదరుడు సుబ్రహ్మణ్యం ఆరోపణలు చేశాడు.

ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి తల్లి సాలమ్మ ఈ దారుణానికి పాల్పడిందంటున్నాడు సుబ్రహ్మణ్యం పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు శ్యామ్ తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి తగాదాలు, ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతుడి శరీర భాగాలు దొరికిన ప్రాంతానికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ తో పాటు శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యాన్ని సైతం పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో లోతుగా విచారణ చేపట్టారు.

మరో విషయం వెలుగులోకి

ముందు హత్యకు ఆస్తి తగాదాలు కారణం కావొచ్చని పోలీసులు భావించారు. అయితే ఆ తర్వాత సంచలన విషయం వెలుగుచూసింది. మద్యానికి బానిసైన శ్యామ్‌ వావివరసలు మరిచి ఇంట్లోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో తెలిపింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం