Kadapa Politics : సీఎం రమేష్ వర్సెస్ ఆదినారాయణ రెడ్డి.. కడప జిల్లా బీజేపీలో బహిరంగ విమర్శలు!
Kadapa Politics : బీజేపీ నేతల మధ్య వార్ జరుగుతోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆదిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. ఆదినారాయణ రెడ్డి అనుచరులపై సీఎం రమేష్ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు. దీనిపై ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. సీఎం రమేష్ లేఖాస్త్రాన్ని సంధించారు. జమ్మలమడుగు నియోజకవర్గంంలో అసాంఘిక కార్యక్రమాలు పేట్రేగిపోతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఈనెల 2న లేఖలు రాశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుడుగా పేరొందిన దేవగుడి నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో.. రిపబ్లిక్ క్లబ్‌లో అనధికార, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పేకాట ఆడుతున్నారని ఆరోపించారు. మొత్తం 11 టేబుల్స్ ఉండగా.. ఒక్కొక్క టేబుల్‌కు రూ.25 వేల నుంచి లక్ష రూపాయాల వరకు బెట్టింగ్ వసూలు చేస్తున్నట్టు లేఖలో ఆరోపించారు.
కలెక్టర్, ఎస్పీలకు లేఖ..
జమ్మలమడుగు మండలంతో పాటు కడప జిల్లా సరిహద్దు ప్రాంతాలలో.. పేకాట, మట్కా, కల్తీ మద్యం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను సీఎం రమేష్ కోరారు. మహిళలకు ఇబ్బందులకు గురి చేసే అసాంఘిక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులల్లో ప్రోత్సహించదని లేఖలో స్పష్టం చేశారు. యువత జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల దాడులు..
ఈ ఫిర్యాదుతో రిపబ్లిక్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఎంపీ సీఎం రమేష్ ఆరోపణలకు బలం చేకూరేలా ఆధారాలేవీ లభించలేదనని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్ కంపెనీ చేపట్టిన పనుల్ని ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవడం, ఉద్యోగుల్ని కొట్టడాన్నిఆయన జీర్ణించుకోలేకపోయారు. అందులో భాగంగానే ఈ లేఖాస్త్రాన్ని సంధించారని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటున్నారు.
అనకాపల్లి ఎంపీకి ఇక్కడేం పని?
ఎంపీ సీఎం రమేష్ తన అనుచరుడిపై ఫిర్యాదు చేయడంపై ఆదినారాయణ రెడ్డి రగిలిపోతున్నారు. అసలు అనకాపల్లి ఎంపీ ఇక్కడేంటీ పని అంటూ సీఎం రమేష్‌పై ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. తమ వాళ్లు తప్పు చేస్తే చెప్పుతో కొడతా, లేదంటే ఆరోపించిన వారిని చెప్పుతో కొట్టాలా? అంటూ ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు లేఖలు ఎవడైనా రాస్తాడా? అని ఫైర్ అయ్యారు. ఆయన లేఖ సినిమా కథలా ఉందన్నారు. తమ నియోజకవర్గంలో ఉత్పత్తి చేసే ప్రతిదానిపై తమకు హక్కుందన్నారు ఆదినారాయణ రెడ్డి.
బీజేపీలో చేరి..
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పొట్లదుర్తి. అదే నియోజకవర్గానికి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం రమేష్ 2019 వరకు టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను తదితర కేంద్ర ఏజెన్సీలు సోదాలు నిర్వహించాయి. 2019లో రాష్ట్రంలో టీడీపీ ఓటమి తరువాత ఆయన బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.
వైసీపీ తరఫున గెలిచి..
ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2017లో అధికార టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వంలో 2017 నుంచి 2019 వరకు మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో రాష్ట్రంలో టీడీపీ ఓటమితో అక్టోబర్ 22న బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)