Felicitation Postponed: విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు వాయిదా..స్కూల్స్ తెరిచాక అవార్డుల ప్రదానం-postponement of honor program for students of government schools program after opening of schools ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Postponement Of Honor Program For Students Of Government Schools, Program After Opening Of Schools

Felicitation Postponed: విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు వాయిదా..స్కూల్స్ తెరిచాక అవార్డుల ప్రదానం

B.S.Chandra HT Telugu
May 24, 2023 07:21 AM IST

Felicitation Postponed: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తలపెట్టిన పురస్కారాల ప్రదానం కార్యక్రమం వాయిదా పడింది. పాఠశాలలు పున: ప్రారంభమైన తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

విద్యార్ధులకు పురస్కార కార్యక్రమం వాయిదా
విద్యార్ధులకు పురస్కార కార్యక్రమం వాయిదా

Felicitation Postponed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్ధులకు పురస్కారాలు, నగదు ప్రోత్సహకాలు అందించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు, సూచనలతో జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదివి అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్దులకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

మే నెల 25 నియోజకవర్గాలు, 27న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయిలో ముఖ్యమంత్రి సమక్షంలో విద్యార్ధులకు పురస్కార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు నడుస్తున్నాయి. దీంతో ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను 'జగనన్న ఆణిముత్యాల పేరుతో స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డ్స్‌' పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సత్తా చాటిన విద్యార్దులకు రాష్ట్ర స్థాయిలో పురస్కారాలతో పాటు నగదు ప్రోత్సాహకాలను కూడా అందించనున్నారు.

వివిధ ప్రభుత్వ యాజమాన్య సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్‌ పబ్లిక్‌ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది.

ఇంటర్‌ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం, విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వనున్నారు. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు.

WhatsApp channel