Visakha Ganja Sumggling: విశాఖలో కొరియర్ బాయ్స్ గంజాయి స్మగ్లింగ్
Visakha Ganja Sumggling: విశాఖలో గంజాయి డోర్ డెలీవరి చేస్తున్న కొరియర్ బాయ్స్‌ను పోలీసులు గుర్తించారు. కొరియర్ మాటున కస్టమర్స్‌కు నేరుగా గంజాయి అందిస్తున్న వైనం వెలుగు చూసింది.
Visakha Ganja Sumggling: విశాఖలో కొరియర్ మాటున కొందరు గంజాయి రవాణా చేస్తున్నారని పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. పలు కొరియర్ సంస్థలకు చెందిన డెలీవరి బాయ్స్ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సిపి నేరుగా టూటౌన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రాంతాల్లో దాడుల్లో పాల్గొన్నారు. రవాణాకి సిద్దంగా ఉంచిన 200 కేజిల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పక్కా సమాచారం రావడంతో దాడులు చేసినట్టు తెలిపారు
నగరంలో పలువురు కొరియర్ బాయ్ ల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అలాంటి వారిపై నిఘా పెట్టామని చెప్పారు. ప్రస్తుతం రవాణాకి పాల్పడుతున్నవారు పరారీలో ఉన్నారని వివరించారు.
నగరంలోని ఏ కొరియర్ కంపెనీ అయినా నిబంధనలు అతిక్రమించి ఇలాంటి చట్ట వ్యతిరేక, నిషేధిత గంజాయిని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కేసులు తప్పవని హెచ్చరించారు.
అనుమానితులపై నిఘాపెట్టామని, నగరం మొత్తం వారి కోసం జల్లెడ పడుతున్నట్టు వివరించారు. ప్రస్తుతం గంజాయి స్వాధీనం చేసుకున్న ఇంటిలో వున్న వ్యక్తులు పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఏడాదిన్న కాలంగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా గంజాయి గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం వచ్చిందని అక్కడ కూడా ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని చెప్పారు.
నగరంలో అద్దెకి ఇళ్లు ఇచ్చేవారు అద్దెకి దిగేవారి వివరాలను పూర్తిగా కనుక్కున్న తరువాత మాత్రమే ఇళ్లు అద్దెకి ఇవ్వాలన్నారు. ఈ దాడుల్లో టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చి కష్టాల్లో పడొద్దని హెచ్చరించారు.