Sankranti Kodi Pandalu : కోడిపందాలపై ఫోకస్.. GPSతో రంగంలోకి పోలీసులు
Cock Fight In AP : సంక్రాంతి వచ్చిందంటే.. చాలు.. మెుదటగా వినిపించే పేరు కోడి పందాలు. ఇతర ప్రాంతాలతోపాటుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది. దీంతో పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.
సంక్రాంతి వచ్చేస్తుంది.. కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. అయితే పోలీసులు దీనిపై దృష్టిపెట్టారు. ముందుగా కోడిపందాల మైదానాలను గుర్తిస్తున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రదేశాల్లో.. మళ్లీ కోడిపందాలకు వేదికగా మార్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. మైదానంలో కోడిపందాలను అనుమతించవద్దని ఇప్పటికే భూ యజమానులను హెచ్చరిస్తున్నారు. జూద కార్యకలాపాలు జరిగితే అటువంటి మైదానాలను స్వాధీనం చేసుకుంటామన్నారు.
కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు ఇప్పటికే కోడిపందాలను అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు మైదానాలను గుర్తిస్తున్నారు. కోడి పందాలకు కోసం కత్తుల తయారీదారులు, విక్రయదారులు, గతంలో కోడిపందాల నిర్వాహకులు, గుండాట, కార్డ్ ప్లే, ఇతర జూద ఆటలు నిర్వహించే వారిపై ఫోకస్ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాల్లో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కోడిపందాలతోపాటుగా ఇతర జూద నిర్వాహకులకు సంబంధించి 180 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో 80 మందిని మండల మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు, క్రీడాకారులు, భూమి యజమానులు, కోడి కత్తి తయారీదారులు, అమ్మకందారులు మొదలైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని మైదానాలు, ప్రదేశాలను జీపీఎస్‌తో అనుసంధానం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మైదానం లేదా సమీపంలోని ప్రదేశాలలో ఏదైనా కార్యకలాపాలు గమనించినట్లయితే, సమాచారం తక్షణమే పోలీసులకు చేరుతుంది. కోడిపందాలను అరికట్టేందుకు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని పోలీసులు అంటున్నారు. మైదానాల సర్వే నంబర్లను సేకరిస్తున్నామని, కోడిపందాల నిర్వాహకులకు భూములు ఇస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోడిపందాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి చెప్పారు. ఎవరూ తప్పించుకోలేరు.. పోలీసులు మైదానాన్ని గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కోడిపందాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను వివరించారు. పిఠాపురం సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఐదు గ్రామాలైన దుర్గాడ, తాటిపర్తి, చెందుర్తి, చిన జగ్గంపేట, కొడవలి గ్రామాల్లో పర్యటించి కోడిపందాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కోడిపందేల నిర్వాహకులకు ఇవ్వొద్దని రైతులకు సూచించారు.