Yandagandi Crime Story : ఇంత దారుణమా.. ఆస్తికోసం అమాయకుణ్ని చంపేశారు.. పాపం పర్లయ్య-police solve the case of a body found in a wooden box in yandagandi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Yandagandi Crime Story : ఇంత దారుణమా.. ఆస్తికోసం అమాయకుణ్ని చంపేశారు.. పాపం పర్లయ్య

Yandagandi Crime Story : ఇంత దారుణమా.. ఆస్తికోసం అమాయకుణ్ని చంపేశారు.. పాపం పర్లయ్య

Basani Shiva Kumar HT Telugu
Dec 28, 2024 11:14 AM IST

Yandagandi Crime Story : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో.. చెక్కపెట్టెలో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం బెదిరించేందుకే నిందితులు హత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ అమాయకుడు ప్రాణం కోల్పోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితులు
నిందితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో చెక్కపెట్టెలో మృతదేహం కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ క్రైమ్ జరిగిందని స్పష్టం చేశారు. ఎకరంన్నర పొలం, పాత ఇంటిమీద ఆశతో బెదిరింపులకు, హత్యకు పాల్పడ్డారు.

yearly horoscope entry point

నేపథ్యం ఏంటీ..

ఉండి మండలం యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, హైమావతి దంపతులకు తులసి, రేవతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె తులసికి 2003లో శ్రీనివాసరాజుతో పెళ్లి అయ్యింది. అతనికి బాగా అప్పులు అయ్యాయి. దీంతో ఆయన అదృశ్యమయ్యాడు. తులసి పుట్టింటికి వచ్చేసింది. ఆమెకు తల్లి హైమావతితో ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తాయి.

ఇక చిన్న కుమార్తె రేవతి.. కృష్ణా జిల్లా మల్లంపూడికి చెందిన తిరుమాని శ్రీధర్‌ వర్మను పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాది కిందట ఆమె భర్తతో కలిసి యండగండిలోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో ఆస్తి తగాదాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో.. పెద్ద కుమార్తె తులసి విడిగా అద్దె ఇంట్లో ఉంటోంది.

ప్లాన్ ఇలా..

రంగరాజుకు రెండెకరాల 40 సెంట్ల పొలం ఉంది. ఇద్దరు కుమార్తెలకు అరెకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన భూమి, తల్లి పేరుమీద ఉన్న ఇంటి కోసం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. శ్రీధర్‌వర్మ, రేవతి కలిసి ఆ ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నారు. అక్క భర్త అప్పులపాలై పరారవడం, అప్పులవాళ్లు ప్రశ్నించడం వంటివన్నీ ఎవరో చేసిన చేతబడి కారణంగా జరుగుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పులిచ్చిన వారు శవాన్ని కూడా పంపుతారంటూ భయపెట్టారు.

పార్సిల్ బాక్స్‌లో..

తులసికి గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది. అది నిర్మాణ దశలో ఉంది. దీంతో ఆమె ఇంటికి ఓ సేవా సమితి పంపినట్లుగా.. శ్రీధర్‌ వర్మ తన ప్రియురాలు సుష్మ సహాయంతో సెప్టెంబరులో రెండుసార్లు ఇంటి నిర్మాణ సామాగ్రి పంపించారు. ఈనెల 19న విద్యుత్తు సామాగ్రి పంపిస్తున్నామని చెప్పి.. కూలీ పనులు చేసుకునే పర్లయ్యను హత్య చేసి శవాన్ని పెట్టెలో పెట్టి పంపించారు. ఆస్తి ఇచ్చేందుకు తులసీ అంగీకరిస్తే.. శవాన్ని సముద్రంలో పడేయాలని భావించారు. కానీ.. తులసికి అనుమానం వచ్చి తెలిసిన వారికి ఈ విషయం చెప్పింది. వారి ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో శ్రీధర్‌ వర్మ పరారయ్యాడు అని ఎస్పీ వెల్లడించారు.

పాపం పర్లయ్య..

నిందితులకు తులసిని భయపెట్టేందుకు శవం దొరకలేదు. దీంతో అమాయకుడైన పర్లయ్య(47)ను పని ఉందని సుష్మ, శ్రీధర్‌ వర్మ పిలిచారు. ఈనెల 17న కారులో కూర్చోబెట్టి మద్యం తాగించారు. పొలాల మధ్యకు తీసుకెళ్లి ఉరేసి చంపేశారు. ఈనెల 19న శవాన్ని పెట్టెలో పెట్టి.. ఆటో మాట్లాడి యండగండికి పంపారు. రూ. 1.30 కోట్లు ఇవ్వాలంటూ సుష్మతో బెదిరింపు లేఖ రాయించి అందులో పెట్టారు.

Whats_app_banner