YS Jagan House : జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యలు.. వరుస ఘటనల దృష్ట్యా పోలీసులు అలర్ట్-police security measures in front of former cm jagan residence ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan House : జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యలు.. వరుస ఘటనల దృష్ట్యా పోలీసులు అలర్ట్

YS Jagan House : జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యలు.. వరుస ఘటనల దృష్ట్యా పోలీసులు అలర్ట్

Basani Shiva Kumar HT Telugu
Published Feb 09, 2025 03:40 PM IST

YS Jagan House : ఇటీవల జగన్ నివాసం దగ్గర వరుస ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు అమర్చారు. వైసీపీ ఓటమి తర్వాత కొందరు యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అందుకే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యలు
జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం జగన్ నివాసం పరిసరాల్లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఓటమి అనంతరం జగన్ నివాసం ఎదుట ర్యాలీలు చేపడుతూ.. రాజకీయ నినాదాలతో కొంత మంది యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

బీజేవైఎం ముట్టడి..

గతేడాది సెప్టెంబర్ 22న తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. ఇంటి గేట్ల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. జగన్ ఇంటి గోడలపై ఎరన్రి సింధూరం పూశారు. గేట్లకు కాషాయ రంగు రాశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

లోకేష్ బర్త్‌డే నాడు..

ఇటీవల మంత్రి నారా లోకేష్ బర్త్ డే సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గరకు వెళ్లారు. అక్కడ రోడ్డుపై కార్లు, బైక్‌లతో హారన్ కొట్టారు. జగన్ ఇంటి ముందే కార్లను ఆపి హడావుడి చేశారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై లోకేష్ సీరియస్ అయినట్టు తెలిసింది.

ఇటీవల అగ్నిప్రమాదం..

తాజాగా ఈమధ్య జగన్‌ ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై విచారణ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్‌ స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనుకోకుండా జరిగిందా? ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జగన్ నివాసంలోని రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలోని డేటాను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వైసీపీ ఆందోళన..

ఇలా వరుస ఘటనలు జరగడం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పార్టీల కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పూనుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అటు జగన్ ఇంటి దగ్గర జరిగిన ఘటనలపై నిఘా వర్గాలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

జడ్ ప్లస్ భద్రత..

జగన్ భద్రతపైనా వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఆ మధ్య లోకేష్ స్పందించారు. జగన్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్నా.. ఇంకా అభద్రతాభావం ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. జగన్‌కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని చెప్పారు. జగన్‌ భద్రతలో రెండు ఎస్కార్ట్ బృందాలు.. 10 మంది సాయుధ గార్డులతో భద్రత.. కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్‌ క్రూజర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉన్నాయని వివరించారు.

Whats_app_banner