FIR On ChandraBabu: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు 20 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేటీ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘటనల నేపథ్యంలో కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇదే కేసులో ఇతరులు కూడా పాల్గొన్నారంటూ పలువురు టీడపీ నేతలపై సైతం కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
అంగళ్లులో అల్లర్లు పథకం ప్రకారమే జరిగాయని జిల్లా యస్పీ గంగాధర్ రావు చెప్పారు. అంగళ్ళు అల్లర్ల ఘటనలో పలువురికి గాయాలయ్యాయని, టిడిపి కార్యకర్తలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెచ్చగొట్టారని వివరించారు. బాధితుల ఫిర్యాదు తో చంద్రబాబు నాయుడుతోసహ 19 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంగళ్ళు అల్లర్ల ఘటనలో నిందితులు దేవినేని ఉమా, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి,, దోమ్లపాటి రమేష్, కిషోర్ కుమార్ రెడ్డి, గంట నరహరి, శ్రీరాం చిన్నబాబు, ఆర్. శ్రీనివాసులురెడ్డి, పులపర్తి నాని, ఎం. రాంప్రసాద్ రెడ్డి, ఫటాన్ ఖాదర్ ఖాన్, వై జి రమణ, వై జి సురేంద్ర , రాచకొండ మధుబాబు, పర్వీన్ తాజ్, ఏలగిరి దొరస్వామి నాయుడు, నారాయణస్వామి రెడ్డి లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
తమపై కేసులు పెట్టడంపై టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేది లేదన్నారు. 4వ తేదీన ఘటన జరిగితే 8వ తేదీ రాత్రి ఎఫ్‍ఐఆర్ నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 20 మందిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
పుంగనూరు, అంగళ్లులో రచ్చ చేసి, దాడులకు ఉసిగొల్పిన జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేయించడం అతని ఆత్మన్యూనతకు అద్దం పడుతోందని అచ్చన్నాయుడు ఎద్దేవా చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నారా చంద్రబాబు చేపట్టిన యుద్ధభేరితో జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రోడ్ షోలకు వస్తున్న జనాదరణ చూసి అసహనంతో తప్పుడు కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. జగన్ రెడ్డి చేస్తున్న పిల్ల చేష్టలు చూస్తుంటే జాలేస్తోందని తెలుగుదేశం పార్టీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తల ర్యాలీలు, ధర్నాలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
జెండాలు పట్టుకుని రెచ్చగొట్టింది ఎవరని ప్రశ్నించారు. పులివెందులలో కారులో వచ్చి రెచ్చగొట్టి, టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో వైసీపీ నేతలు తోక ముడిచి పారిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న ఉత్సాహం, చంద్రబాబు సభలకు, లేవనెత్తిన అంశాలకు ప్రజల నుండి మెరుగైన స్పందన వస్తుండడంతో.. ఏం చేయాలో తెలియని స్థితిలో దాడులకు తెగబడుతున్నారన్నారు.
దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపై కేసులు పెట్టడం జగన్‌కు మాత్రమే చెల్లిందన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని, ఎంత మందిని అరెస్టు చేస్తారో చేసుకోవాలని, బాధింపబడిన ప్రతి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి న్యాయం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒంటి నుండి చిందిన ప్రతి రక్తపు బొట్టుకూ బదులు చెప్పితీరుతామన్నారు.