EG Gang Rape: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం, మహిళపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి యత్నం...కేసు నమోదు చేసిన పోలీసులు
EG Gang Rape: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒంటరి మహిళపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి యత్నించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
EG Gang Rape: ఒంటరి మహిళపై సామూహిక అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం రాజమండ్రి రూరల్ మండలంలోని మోరంపూడి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళ (30) తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా నివాసముంటోంది. ఆమె రాజమండ్రి నగరంలోని ఓ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఏడాది క్రితం మోరంపూడి ప్రాంతానికే చెందిన బి.సతీష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్తా సహజీవనం సాగించే వరకు దారి తీసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన మార్గాని గోపి సురేంద్ర, కాలేపల్లి మనోజ్, సానెపు రమేష్, తోరంత్రి వంశీ, బొర్రా ప్రశాంత్ కుమార్ అనే ఐదుగురు యువకులు ఆమెపై కన్నేశారు. ఈ క్రమంలో ఆ మహిళ, సతీష్‌లకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగేవారు. శుక్రవారం రాత్రి ఐదుగురు యువకులు కలిసి మహిళ ఇంట్లోకి చొరబడ్డారు.
ఇంట్లో ఉన్న సతీష్‌ను బయటకు పిలుచుకొచ్చి, ఆయనను భయపెట్టి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఇంట్లోకి చొరబడి ఒంటిరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి యత్నించారు. అయితే ఆమె వారిని ప్రతిఘటించి, వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి స్థానికులను పిలిచింది. దీంతో ఆ ఐదుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులంతా అక్కడ గుమిగూడి ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు మహిళ జరిగిన విషయం స్థానికులకు వివరించింది.
ఈ ఘటనపై బాధిత మహిళ ఆదివారం రాత్రి బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో అక్రమంగా చొరబడి, తనపై అఘాయిత్యానికి ప్రయత్నించారని తెలిపింది. తాను తప్పించుకుని, బయటకొచ్చి స్థానికులను పిలవడంతో నిందితులు పరారయ్యారని తెలిపింది. మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.
పరారీలో ఉన్న నిందితుల గురించి పోలీసులు గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతామని బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. బాధిత మహిళ వద్ద పూర్తి వివరాలు సేకరించామని పేర్కొన్నారు. ఒంటిరి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)