Andhra Odisha Border : ఛత్తీస్‌గడ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ఏవోబీలో అలర్ట్.. కీలక నేతలందరూ అక్కడే మకాం!-police monitoring maoist movements in andhra odisha border ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Odisha Border : ఛత్తీస్‌గడ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ఏవోబీలో అలర్ట్.. కీలక నేతలందరూ అక్కడే మకాం!

Andhra Odisha Border : ఛత్తీస్‌గడ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ఏవోబీలో అలర్ట్.. కీలక నేతలందరూ అక్కడే మకాం!

Basani Shiva Kumar HT Telugu
Jan 23, 2025 12:22 PM IST

Andhra Odisha Border : మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో దళ సభ్యులు భారీగా హతమయ్యారు. ఇటు పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకునే పొలిట్‌బ్యూరో కూడా చిక్కిపోతోంది. దీంతో ఉన్న కొందరు కూడా ఏవోబీలో తల దాచుకుంటున్నారు.

ఏవోబీలో అలర్ట్
ఏవోబీలో అలర్ట్

ఇటీవల సరిహద్దు రాష్ట్రాల్లో వరుస ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది. దీంతో కొందరు దళ సభ్యులు ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బార్డర్)లోకి వచ్చి తలదాచుకుంటున్నట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. గత మూడు నెలల్లో ఛత్తీస్‌గడ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎదురు కాల్పులు జరిగాయి. భారీ స్థాయిలో మావోయిస్టులు హతమయ్యారు.

ఏవోబీలో అలర్ట్..

ఇక మిగతా వారంతా ఏవోబికి చేరుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏవోబీలో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ, ఇతర దళనేతలు ఉదయ్, జగన్, సురేష్‌తోపాటు.. మరో 15 మంది ప్రస్తుతం ఏవోబీలోనే ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం.

అబూజ్‌మడ్‌‌లో అలజడి..

పార్టీకి ఇంతకాలం దండకారణ్యంలోని అబూజ్‌మడ్‌ పెట్టనికోటలా ఉంది. అక్కడి అగ్రనేతల రహస్య స్థావరాల వైపు భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. వారిని మావోయిస్టులు ఎంతకాలం నిలువరిస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 2004లో ఏర్పడిన మావోయిస్టు పార్టీ.. రెండు దశాబ్దాల తర్వాత తీవ్ర నిర్బంధానికి గురవుతోంది. ఒకప్పుడు పాలకులను భయపెట్టిన పార్టీ.. ఇవాళ ముప్పును ఎదుర్కొంటోంది.

ప్రస్థానం ఇలా..

2004 సెప్టెంబరు 21న సీపీఐ- మావోయిస్టు పార్టీ ప్రస్థానం మొదలైంది. ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి తొలి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అప్పట్లో పొలిట్‌బ్యూరోలో 16 మంది అగ్రనేతలు ఉండేవారు. వీరిలో ఏడుగురు తెలుగువారే కావడం గమనార్హం. ఆ తర్వాత లొంగుబాట్లు, అరెస్టులు, మరణాలతో కొందరు అగ్రనేతలు దూరమయ్యారు. వరుస ఎదురుదెబ్బల కారణంగా ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది.

మిగిలింది వీరే..

నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి సభ్యుడిగా ఉన్నారు. మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి అధికార ప్రతినిధిగా ఉన్నారు. మిసిర్‌ బెస్రా, సుమానంద్‌ సింగ్‌ అలియాస్‌ సుజిత్‌ ప్రస్తుతం పొలిట్‌ బ్యూరోలో ఉన్నారు.

Whats_app_banner