Missing Girl: పవన్ ఆదేశాలతో పోలీసుల దర్యాప్తు,9 నెలల తర్వాత లభ్యమైన మైనర్ అచూకీ-police investigation on pawans orders missing girl found after 9 months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Missing Girl: పవన్ ఆదేశాలతో పోలీసుల దర్యాప్తు,9 నెలల తర్వాత లభ్యమైన మైనర్ అచూకీ

Missing Girl: పవన్ ఆదేశాలతో పోలీసుల దర్యాప్తు,9 నెలల తర్వాత లభ్యమైన మైనర్ అచూకీ

Sarath chandra.B HT Telugu
Jul 03, 2024 09:03 AM IST

Missing Girl: కన్నబిడ్డ అచూకీ కోసం ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు, తిరగని ప్రదేశం లేదు, కనిపించిన వారినల్లా అర్ధించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జమ్మూలో అచూకీ కనుగొన్నారు.

కుమార్తె అచూకీ కోసం పవన్‌ కళ్యాణ్‌కు మొరపెట్టుకుంటున్న తల్లి
కుమార్తె అచూకీ కోసం పవన్‌ కళ్యాణ్‌కు మొరపెట్టుకుంటున్న తల్లి

Missing Girl: కన్నబిడ్డ అదృశ్యమై తొమ్మిది నెలలు గడుస్తున్నా అచూకీ లేకపోవడంతో తల్లడిల్లిన తల్లి సాయం చేయాలంటూ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ను అర్థించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసు దర్యాప్తుపై పవన్ స్వయంగా ఫోన్ చేసి ఆరా తీయడంతో పోలీసులు అలర్టయ్యారు. ఆగమేఘాలపై స్పందించారు. చివరకు ఆమె జమ్మూలో ఉన్నట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించి విజయవాడ తరలించారు.

విద్యాభ్యాసం కోసం విజయవాడ వచ్చిన టీనేజ్ యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఆమెతో కలిసి పారిపోయాడు. దేశంలో ఎక్కడెక్కడికో తిప్పాడు. చివరకు జమ్మూలోని హోటల్లో పనికి కుదిరాడు. అక్కడే చిన్న గదిలో ఆమెతో కలిసి ఉంటున్నాడు. మరోవైపు కుమార్తె అచూకీ కోసం తల్లి చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది విజయవాడ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. యువతి మరో యువకుడితో కలిసి వెళ్లిపోయినట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తు అక్కడితో ఆపేశారు.

కుమార్తె అచూకీ కోసం 9నెలలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్న ఆమె తల్లి గత నెలాఖరులో పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న క్రమంలో బాధితురాలి దీన స్థితిని చూసి చలించిపోయిన పవన్ వెంటనే మాచవరం పోలీసులకు ఫోన్ చేశారు. యువతి మిస్సింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న పోలీసులు అప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలు చెప్పారు. ఆ తర్వాత వారికి న్యాయం చేయాలంటూ తన సిబ్బందితో కలిపి పోలీస్ స్టేషన్‌కు పంపారు.

దీంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. విజయవాడ పోలీసులు మైనర్ బాలిక అదృశ్యం దర్యాప్తును వేగవంతం చేశారు. చివరకు జమ్మూలో ఆమె అచూకి కనిపెట్టారు. కుమార్తె కోసం ఆ తల్లి రోదనలు విని చలించిన పవన్ కళ్యాణ్ మాచవరం సీఐతోనూ, విజయవాడ పోలీస్ కమిషనర్ తోనూ ఫోనులో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని ఆదేశించారు. యువతి అచూకీ లభించడంతో విజయవాడ సీపీని ప్రత్యేకంగా అభినందించారు.

తమ బిడ్డ కనిపించకపోతే 24 గంటల్లోపు ఫిర్యాదు చేసి విచారణ వేగంగా మొదలుపెడితే ప్రయోజనం ఉంటుందన్నారు. యువతులను లవ్ ట్రాప్ చేసి ఈ విధమైన నేరాలు చేస్తున్నారని... అలా చేసేవారి పట్ల ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. ప్రేమ పేరుతో వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు.

గతంలో మరో యువతి….sara

భీమవరంకు చెందిన యువతి విజయవాడలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరింది. అక్కడే సీనియర్‌గా ఉన్న అంజాద్ అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. షణ్ణూ పేరుతో గత ఏడాది మరో యువతిని ఇలాగే అపహరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలతో స్నేహం పెంచుకునే వాడు. గత ఏడాది ఓ యువతిని తీసుకెళ్లిపోయిన సమయంలో పోలీసులు వారిని వెదికి పట్టుకుని యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత భీమవరం యువతిని అపహరించాడు. బాధితురాలు విజయవాడలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది.

గత ఏడాది అక్టోబర్‌ 28వ తేదీన ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అంజాద్‌ కొంత నగదు తీసుకెళ్లాడు. ఊరెళుతున్నానని చెప్పినా భీమవరం చేరకపోయేసరికి ఆమె తల్లి విజయవాడ వచ్చి.. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గత ఏడాది అక్టోబర్‌లో కేసు నమోదు చేసిన వెంటనే వారు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లేలోపు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారి ఆచూకీ లభించలేదు. హైదరాబాద్‌లోనే ఓ షాపులో రూ.18 వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ డబ్బుతో కేరళ వెళ్లారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా కాంటాక్ట్‌లో లేకుండా పోయారు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.

హైదరాబాద్‌ నుంచి కేరళ వెళ్లి కొద్ది రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాాద్, కేరళాలలో అద్దె ఇంటి కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. రెండోసారి హైదరాబాద్ వచ్చినపుడు యువతి నగలు అమ్మేసి వచ్చిన డబ్బుతో రాజస్థాన్ వెళ్లారు. అక్కడి నుంచి ముంబై, పూణే, ఢిల్లీలో కాలం గడిపారు. చివరకు రైల్లో జమ్మూ వెళ్లి ఓ హోటల్లో పనికి కుదిరాడు. హోటల్ యజమాని వారు ఉండటానికి గదిని ఇవ్వడంతో అందులో ఉంటున్నారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకోడానికి రైళ్లలో టిక్కెట్లు కూడా కొనకుండా ప్రయాణించేవారు.

పవన్ ఆదేశాలతో పోలీసులు గత వారం దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అంజాద్ వాడుతున్న కొత్త మొబైల్ ఫోన్‌ నుంచి యువతి తన సోదరికి ఇన్‌స్టా గ్రామ్‌లో మెసేజ్ పంపింది. తమ అచూకీ తెలియకుండా ఉండటానికి అంజాద్ బాధితురాలికి ఫోన్ కూడా అందుబాటులో ఉంచేవాడు కాదు. ఆమె నుంచి మెసేజ్ రావడంతో ఆ సమాచారం పోలీసులకు అందించారు. ఆ నంబర్‌తో చాటింగ్ ద్వారా లోకేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె మెసేజ్ చేసిన లోకేషన్ మరో దేశాన్ని చూపడంతో ఖంగుతిన్నారు. ఆమె ఎక్కడ ఉందో బాధితురాలు కూడా చెప్పలేకపోయింది.

ఇటీవల అమెజాన్‌లో ఫోటో ఫ్రేమ్ బుక్‌ చేయడంతో వారు ఉంటున్న ప్రాంతానికి అది డెలివరీ చేశారు. ఆ చిరునామాను ఆమె మెసేజీ చేయడంతో జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో గాంధీనగర్ పోలీసుల్ని అప్రమత్తం చేసి వారితో సమన్వయం చేసుకుని బాధితురాలి అచూకీ గుర్తించారు. అంజాద్‌తో పాటు యువతిని విజయవాడ తరలించారు.

WhatsApp channel