Sexual Assault: మహిళపై లైంగిక దాడి.. సెటిల్మెంట్ చేస్తానన్న పోలీస్.. అంతలోనే ట్విస్ట్!
Sexual Assault: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ఫలితంగా నేరాలు చేసిన వారు దర్జాగా తిరుగుతుంటే.. బాధితులు మరింత కుంగిపోతున్నారు. తాజాగా.. ఓ లైంగిక దాడి కేసులో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.
అనంతపురానికి చెందిన వివాహితకు.. హైదరాబాద్ వస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నమ్మించాడు. తీరా ఆవిడ వచ్చాక.. నమ్మించి లైంగికదాడి చేశాడు. బాధిత మహిళ బయటకు వచ్చి ఏడుస్తుండటంతో.. మరో యువతి అక్కడికి వచ్చింది. తనకు కూడా అన్యాయం చేశాడని వాపోయింది. వీడిని ఎలా నమ్మి ఇంతదూరం వచ్చావంటూ ప్రశ్నించింది.
స్నేహితుడికి ఫోన్ నంబర్..
దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే.. లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు.. అతడి స్నేహితుడికి బాధితురాలి ఫోన్ నంబర్ ఇచ్చాడు. అతడు కూడా తాను ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఫోన్ చేసి.. వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనిపైనా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది.
కేసు మలుపు తిరిగింది ఇక్కడే..
కేసు ఇక్కడే మరో మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ అధికారి.. మొదట బాధితురాలిపైనే ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చాడు. ఆమె డబ్బులు ఆశిస్తుందంటూ అధికారులకు చెప్పి.. ఆ కేసు తీవ్రతను తగ్గించాడు. ఆ తరువాత రెండు కేసుల్లో నిందితులను స్టేషన్‌కు పిలిపించాడు. కేసు పెద్దదవుతోందని వారిని బెదిరించాడు. తాను ఆ మహిళతో మాట్లాడుతానని.. మీరు రూ.6 లక్షలు ఇవ్వండి అంటూ సెటిల్మెంట్ చేశాడు.
రూ.6 లక్షలు వసూలు..
నిందితుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసిన ఆ పోలీస్ అధికారి.. అందులో సగం బాధితురాలికి ఇచ్చి.. మిగతా సగం రూ.3 లక్షలు నొక్కేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లైంది.. పిల్లలున్నారు.. కేసులు పెట్టుకొని ఎన్నాళ్లు కొట్లాడుతావంటూ.. ఆ పోలీస్ మహిళను బెదిరించినట్టు తెలిసింది. డబ్బులు వచ్చాయి.. ఈ కేసు మర్చిపో అంటూ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చాడు.
కేసు క్లోజ్ చేస్తాం..
'నీవు కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు ఒక పిటిషన్ ఇస్తే.. నిందితులు సేఫ్ అవుతారు. మేం కూడా నీవు పిటిషన్ వేశావని కేసు క్లోజ్ చేస్తాం. ఎవరి చేతికి మట్టి అంటకుండా అన్ని సర్దుకుంటాయి' అంటూ ఆ పోలీసు బాధితురాలు, నిందితుల మధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం.
ఉద్యోగం పోయిందని..
అనంతపురం జిల్లాకు చెందిన మహిళ బెంగుళూరులో సాప్ట్‌వేర్ జాబ్ చేస్తుండేది. అయితే.. ఆ కంపెనీలో ప్రాజెక్ట్‌లు లేకపోవడంతో తన ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం కోసం ఆన్లైన్‌లో వెతుకుతున్న ఆమెకు.. హైదరాబాద్‌కు చెందిన నర్సింహ రెడ్డి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. జాబ్ ఇప్పిస్తానని తనని హైదరాబాద్‌కు పిలిపించాడు.
రూమ్‌లో బంధించి..
హైదరాబాద్‌కు కుటుంబంతో వచ్చిన ఆమె.. ఇంటర్వ్యూ కోసం నర్సింహ రెడ్డికి చెందిన ఆఫీస్ దగ్గరికి వెళ్లింది. ఇంటర్వ్యూ పక్కనబెట్టిన నర్సింహా రెడ్డి ఆమెను ఒక రూంలో బంధించి అత్యాచారం చేశాడని మహిళ ఆరోపిస్తోంది. నర్సింహ రెడ్డితో పాటు ఉన్న లవకుమార్ కూడా తనతో కలవాలని వేధించాడని చెబుతోంది. దీంతో ఆమె తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.