Vallabhaneni Vamsi Row : వంశీ పాత కేసులపై పోలీసుల ఫోకస్.. పీటీ వారెంట్లు వేసి కస్టడీలోకి తీసుకునే ఛాన్స్!
Vallabhaneni Vamsi Row : సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో.. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసుపై రచ్చ జరుగుతుండగానే.. మరో విషయం బయటకొచ్చింది. ఆయన పాత కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ.. ఉచ్చు బిగుస్తోందనే కామెంట్స్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పెండింగ్ కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు విచారణకు హాజరుకాకుండా ఉన్న కేసులను పోలీసులు బయటకు తీస్తున్నట్టు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ గన్నవరం రాలేదు. దీంతో దర్యాప్తునకు ఆటంకం కలిగిందని అంటున్నారు.
తెరపైకి పాతకేసులు..
వంశీకి సంబంధించిన పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి.. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్ ఠాణాలో గతేడాది నవంబరులో ఓ కేసు నమోదైంది. దీంట్లో వంశీ ఏ2గా ఉన్నారు. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
పీటీ వారెంట్ వేయడానికి..
గత ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై తేలప్రోలులో వంశీ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా.. వంశీకి 41ఏ నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన ఇంతవరకు విచారణకు హాజరుకాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ వేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మళ్లీ విచారణ జరిపి..
గన్నవరంకు చెందిన రంగబాబు అనే వ్యక్తి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. గతంలో ఆయన వల్లభనేని వంశీకి అనుచరుడిగా ఉండేవారు. అయితే.. యార్లగడ్డ వెంకట్రావు తోపాటు రంగబాబు కూడా టీడీపీలో చేరారు. రంగబాబుపై వంశీ తన అనుచరులతో దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు దీనిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ విచారణ జరిపి.. హత్యాయత్నం కింద 307 సెక్షన్‌ను చేర్చారు. ఇందులోనూ వంశీని కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
వంశీకి ప్రాణహాని..
విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీని శారీరకంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టారు. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. ఆయన శ్వాస సమస్యతో బాధపడుతున్నారు' పంకజశ్రీ వివరించారు.