Indrakeeladri Photos : దుర్గగుడి అంతరాలయం వీడియో వైరల్ … పోలీస్‌ కేస్ నమోదు…-police case has been registered against those who filmed the video of goddess durga in the temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Police Case Has Been Registered Against Those Who Filmed The Video Of Goddess Durga In The Temple

Indrakeeladri Photos : దుర్గగుడి అంతరాలయం వీడియో వైరల్ … పోలీస్‌ కేస్ నమోదు…

HT Telugu Desk HT Telugu
Jan 04, 2023 07:37 AM IST

Indrakeeladri Photos దుర్గగుడి అంతరాలయం వీడియోలు, ఫోటోలను వైరల్ చేసిన ఘటనపై పోలీస్ కేసు నమోదైంది. నిషిద్ద ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా వీడియో తీయడంతో పాటు వాటిని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేస్ నమోదు చేశారు

కనకదుర్గమ్మ మూలవిరాట్ వీడియోలు వైరల్, పోలీస్ కేసు నమోదు
కనకదుర్గమ్మ మూలవిరాట్ వీడియోలు వైరల్, పోలీస్ కేసు నమోదు (twitter)

Indrakeeladri Photos బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ గుడి అంతరాలయంలో వీడియోల చిత్రీకరణ వ్యవహారంపై పోలీస్‌ కేస్‌ నమోదైంది. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా దుర్గగుడి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో భక్తులు ఆలయ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ఆలయ యంత్రాంగం విచారణ జరిపింది.

ట్రెండింగ్ వార్తలు

సీసీటీవీ ఫుటేజీల ద్వారా వీడియోలు తీసింది ఎవరో గుర్తించారు. శాంతకుమారి అనే భక్తురాలు వీడియోలు చిత్రీకరించినట్లు గుర్తించామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22న ఉ.9.52 గంటలకు భక్తురాలు చిత్రీకరించినట్లు గుర్తించామని ఈవో చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై ఫిర్యాదు చేశామని ప్రకటించారు. దుర్గగుడిలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసినట్టు భ్రమరాంబ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన బెజవాడ దుర్గమ్మ అంతరాలయం వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడం వెలుగుచూసింది. అమ్మవారి మూలవిరాట్‌ను ఎవరో వ్యక్తులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు. కనకదుర్గ టెంపుల్‌ ఐటీలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు వెలుగు చూశాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగివుండొచ్చనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అమ్మవారి వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై మండిపడుతున్నారు. ఈ చర్యకు పాల్పడినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల అచూకీ కోసం గాలిస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

IPL_Entry_Point