యువకులను గొడ్డును బాదినట్టు బాదిన పోలీసులు.. తెనాలిలో దారుణం!-police beat up 3 people in tenali of guntur district video goes viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  యువకులను గొడ్డును బాదినట్టు బాదిన పోలీసులు.. తెనాలిలో దారుణం!

యువకులను గొడ్డును బాదినట్టు బాదిన పోలీసులు.. తెనాలిలో దారుణం!

సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దాంట్లో పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. అయితే.. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్‌పై దాడి చేస్తే కొట్టారని కొందరు అంటుంటే.. లంచం గురించి ప్రశ్నిస్తే చితకబాదారని మరికొందరు అంటున్నారు.

యువకులను కొడుతున్న పోలీస్

ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కర్రతో కొట్టిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తెనాలిలో జరిగినట్టు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే పోలీసులు యువకులను దారుణంగా కొట్టారు. దీని గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి వెర్షన్ ప్రకారం..

డబ్బులు ఇవ్వమని అడిగారు..

కన్నా చిరంజీవి అనే వ్యక్తి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్‌కి సంబంధం లేదు. పోలీసు కానిస్టేబుల్ (పీసీ 6068) కన్నా చిరంజీవి.. 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని అడిగారు. లేకపోతే అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని చెప్పారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు చెప్పమన్నారని బెదిరించారు.

వీధులన్నీ తిప్పుతూ..

డబ్బులు ఇవ్వడానికి యువకులు తిరస్కరించారు. ఆగ్రహించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి.. ఎక్కడ అతని అవినీతి బయటకు వస్తుందేమోనని.. ముందుగానే వెళ్లి ఈ యువకులపై అబద్ధపు కేసు పెట్టారు. కేసు నమోదు చేసి.. 3 రోజులు వారివద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేశారు. గతనెల 25వ తేదీన ఆ యువకులను విచక్షణారహితంగా కొట్టి.. వీధి వీధులు తిప్పుతూ.. తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్లలో కూర్చోబెట్టారు. ప్రజలు చూస్తుండంగానే విచక్షణారహితంగా కొట్టారు. తెనాలి 2 టౌన్ రాముల నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ బాబులు కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులు సస్పెండ్!

బాధితులు తెనాలి చెంచుపేటకు చెందిన చేబ్రోలు జాన్ విక్టర్, మంగళగిరి తిప్పర్లబజార్‌కు చెందిన షేక్ బాబులాల్, తెనాలి ఐతానగర్‌కు చెందిన దోమా రాకేష్‌గా తెలుస్తోంది. దోమా రాకేష్‌కి కాళ్లు, చేతుల్లో రాడ్లు ఉన్నాయని చెప్పి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా.. పోలీసులు కర్కశంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దాష్టీకానికి పాల్పడిన వీరిని సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

రెండో వెర్షన్ ప్రకారం..

తెనాలి ఐతానగర్‌కు చెందిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు.. విక్టర్, బాబూలాల్, రాకేష్.. కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుపై దాడి చేసినందుకు.. నిందితులను తెనాలి ఐతానగర్ తీసుకెళ్లి.. రోడ్డుపై కూర్చొబెట్టి అరికాలికి కోటింగ్ ఇచ్చారు. ఇలా ఈ రెండు వెర్షన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు.

సంబంధిత కథనం