Lawyers Crime : కంత్రీ లాయర్‌కు చెక్ పెట్టిన పోలీసులు….
Lawyers Crime ఖాళీగా ఉన్న ఇంటిపై కన్నేసిన ఓ కంత్రీ లాయర్, కొడుకుతో కలిసి దానిని కబ్జా చేసి అమ్మేద్దామని ప్లాన్ వేసింది. చివరి నిమిషంలో వారి ప్లాన్ బెడిసి కొట్టి కటకటాల పాలయ్యారు. బతికున్న వారి పేరున డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Lawyers Crime అనంతపురంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తి కాజేయడానికి ప్రయత్నించిన లాయర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేవారు. ఇంటి యజమాని పేరుమీద నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, దాని ఆధారంగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌లు తయారు చేసి విలువైన ఇంటిని కాజేయాలని యత్నించిన మోసగాళ్ల గుట్టును అనంతపురం టూటౌన్ పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో మహిళా న్యాయవాదితో పాటు ఆమె కుమారుడిని సూత్రధారులుగా గుర్తించారు.
ఆస్తి కబ్జా చేయడానికి ప్రయత్నించిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురానికి చెందిన శ్రీరాములు నాయక్ కుటుంబంతో ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనకు నగరంలోని ఆదర్శనగర్ కాలనీలో రూ.75 లక్షలు విలువ చేసే 5.14 సెంట్ల స్థలంలో ఇల్లు ఉంది. కొన్నేళ్లుగా ఇంట్లో ఎవరూ నివాసం లేని విషయాన్ని గుర్రం గణేష్ అనే వ్యక్తి గుర్తించాడు. ఈ విషయాన్ని ధర్మవరంలో ఉంటున్న న్యాయవాది కట్టా శ్రీదేవి, ఆమె కుమారుడు కట్టా నాగశ్రీ గణేష్‌కు చెప్పాడు. ముగ్గురు కలిసి ఇంటిని కాజేయాలని పథకం వేశారు.
నిందితులు ముగ్గురికి వారి ఇంట్లో పనిచేస్తున్న కప్పల ముత్యాలమ్మ, అనిల్‌కుమార్, డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాసప్రసాద్, బండిమాల లోకేశ్వర, సాంబశివలు సహకరించారు. ఇంటి యజమాని శ్రీరాములు నాయక్, భార్య కాంతమ్మ మృతి చెందినట్లు నాగశ్రీ గణేష్ తన ల్యాప్‌టాప్‌లో సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు.
వాటి సాయంతో అనిల్‌కుమార్‌ను శ్రీరాములు నాయక్ కొడుకుగా ఆధార్ కార్డు మార్పుచేర్పులు చేసి, ఆ కార్డు ద్వారా నకిలీ వంశవృక్షం తయారు చేశాడు. ఈ పత్రాల సాయంతో గత నెల 23న ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనిల్‌కుమార్ ద్వారా న్యాయవాది ఇంట్లో పనిచేస్తున్న కప్పల ముత్యాలమ్మ పేరుపై జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు.
ఈ క్రమంలో ఇంటి యజమాని శ్రీరాములు నాయక్ ఇంటిని విక్రయించాలని నిశ్చయించుకుని, రియల్ ఎస్టేట్ మధ్యవర్తులను సంప్రదించారు. వారు రిజిస్టర్ ఆఫీసులో ఆస్తి డాక్యుమెంట్లను పరిశీలించగా అప్పటికే ముత్యాలమ్మ పేరున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్లు తెలుసుకుని, విషయాన్ని యజమానికి తెలిపారు. తన ఇంటిపై వేరే వారి పేర్లతో లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన యజమాని శ్రీరాములు నాయక్ ఈ నెల 10న 'స్పందన' కార్యక్రమంలో ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తును ఎస్పీ టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న పత్రాలను, సాక్ష్యులను, డాక్యుమెంట్‌లను పరిశీలించి నిందితులును గుర్తించారు. కుట్రకు పథక రచన చేసిన వారితో పాటు నిందితులందరిని అరెస్ట్ చేశారు.
టాపిక్