Tirupati : తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌ను అరెస్టు చేసిన పోలీసులు!
Tirupati : తిరుపతిలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్శిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు అండగా ఉండాల్సిన ప్రొఫెసర్ వికృత చేష్టలకు దిగాడు. విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవల్సిన ఆయన కీచకపర్వానికి పాల్పడ్డాడు. ఇంగితం కూడా లేకుండా ఓ విద్యార్థి పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూంలో ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు దిగాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఓ విద్యార్థినిపై వేధింపుల ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పాత పాఠాలు బోధిస్తూ..
తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు తెలిపిన వివరాలు ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన విద్యార్థిని (22) తిరుపతి శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోంది. గతేడాది హాజరు నమోదు తక్కువగా ఉన్నందున.. ఆ విద్యార్థిని పరీక్షలకు అర్హత సాధించలేకపోయింది. ఫీజులు చెల్లించడంతో నవంబర్ నుంచి విద్యార్థిని ఒక్కరికే క్రాప్ ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఉమామహేష్ పాత పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.
ఒక్కతే ఉండటంతో..
క్లాస్ రూంలో విద్యార్థిని ఒక్కతే ఉండటంతో.. ఆమె పట్ల ప్రొఫెసర్ ఉమా మహేష్ అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులుకు పాల్పడటం చేశాడు. దీంతో ఆమె ప్రొఫెసర్ వికృత చేష్టల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. శుక్రవారం తల్లిదండ్రులు తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలను కూడా సమర్పించారు.
విద్యార్థుల ఆందోళన..
మరోవైపు విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్‌ను విధులు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రొఫెసర్ ఉమా మహేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల విచారణ..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెంబర్ 466/2024 కింద కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద ఉన్న ఉమా మహేష్‌ను తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవింద్ అరెస్టు చేశారు. విచారణ చేపట్టారు. ఆయనపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? గతంలో పని చేసిన కాలేజీలో ఇలా ఎప్పుడైనా ప్రవర్తించాడా? అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)