AP Files Burnt Incidents : పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు-polavaram project office files burnt case collector suspended four officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Files Burnt Incidents : పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

AP Files Burnt Incidents : పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

Bandaru Satyaprasad HT Telugu
Aug 18, 2024 11:05 PM IST

AP Files Burnt Incidents :ఏపీలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో దస్త్రాలు దహనం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు
పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధం, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

AP Files Burnt Incidents : ఏపీలో ఫైళ్ల దగ్ధం కొనసాగుతోంది. సీఐడీ ఆఫీసు, మదనపల్లి, తిరుపతి, పోలవరం...ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆఫీసుల్లోని ఫైళ్లు దగ్దం అవుతున్నాయి. ఇవి సాధారణ ప్రమాదాలా? లేక ఏదైనా కుట్ర కోణం ఉందా? విచారణలో తేలాల్సి ఉంది. గత ప్రభుత్వంలో అవినీతి అండగా నిలిచి కొందరు అధికారులు..తమ తప్పులు బయటపడతాయని ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ కేసులో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్‌ ఆర్‌ఐ కళాజ్యోతి, సబార్డినేట్‌ రాజశేఖర్‌ను కలెక్టర్‌ పి. ప్రశాంతి సస్పెండ్‌ చేశారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్లు ఎ. కుమారి, ఎ. సత్యదేవికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే లేదని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో పలు కీలకమైన ఫైళ్లను కాల్చివేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలవరం లెఫ్ట్ కెనాల్ భూసేకరణ దస్త్రాలను ఆఫీసు గేటు బయట సిబ్బంది దగ్ధం చేశారు. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో సగం కాలిన ఫైళ్లను కొన్నింటిని లోపలకు తరలించారు. అసలు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఫైళ్లు దగ్ధం చేయడం, కాల్చివేసిన స్వీపర్‌ విశాఖ వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అవినీతి ఆధారాలు మాయం

పోలవరం ఫైళ్లు దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆఫీసును ఆయన పరిశీలించారు. తగలబెట్టిన ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో జిరాక్స్‌ పేపర్లుగా చెప్పడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆధారాలను మాయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

తిరుపతి టీటీడీ భవనంలో అగ్ని ప్రమాదం

తిరుపతిలోని టీటీడీ భవనంలో ఫైళ్ల దహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసు మరవక ముందే రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ పరిపాలన భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఇంజినీరింగ్ విభాగంలో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మంటలు చెలరేగగా... అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపు సిబ్బందే మంటలు అదుపుచేశారు. పూజ కోసం వెలిగించిన దీపం వల్ల పేపర్లు అంటుకుని అగ్ని ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఇంజినీరింగ్ పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న సమయంలో... అదే సెక్షన్ లో పలు ఫైళ్లు కాలిపోవడంపై అనుమానాలకు తావిస్తుంది. అగ్ని ప్రమాదంపై టీటీడీ ఉన్నతాధికారులకు సిబ్బంది ఆలస్యంగా సమాచారం అందించారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఘటనాస్థలిని పరిశీలించారు.

సంబంధిత కథనం