Life Imprisonment: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు-pocso court sentenced father for raping daughter to life imprisonment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Life Imprisonment: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

Life Imprisonment: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

Sarath chandra.B HT Telugu

Life Imprisonment: వావి వరసలు మరిచి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి విజయవాడ కోర్టు కఠిన శిక్ష విధించింది. కోర్టు విచారణలో సాక్షులు అడ్డం తిరిగినా సాంకేతిక ఆధారాలతో శిక్షను ఖరారు చేయడం సంచలనం సృష్టించింది.

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం (HT_PRINT)

Life Imprisonment: కామంతో కళ్లు మూసుకుపోయి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. కోర్టు విచారణలో సాక్షులు అడ్డం తిరిగినా ప్రాసిక్యూషన్‌ సమర్పించిన సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా అత్యాచారాన్ని నిర్ధారించిన న్యాయస్థానం నిందితుడు మరణించే వరకు జైల్లోనే ఉండాలని తీర్పు వెలువరించారు. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

వావివరసలు వదిలేసి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించడం కలకలం సృష్టించింది. చిన్నారిపై అకృత్యానికి పాల్పడిన తండ్రికి మరణించే వరకు ఖైదుతో పాటు, రూ.50 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.రజిని తీర్పు వెలువరించారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2023 జనవరి 12న దిశ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376 376 (3), పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు సవాలుగా తీసుకున్నారు.

10 మంది సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానంలో నమోదు చేశారు.విచారణలో సాక్షులు ప్రాసిక్యూషన్‌కు సహకరించకపోయినా సాంకేతిక ఆధారాలు, డీఎన్ఏ నమూనాలు సరిపోలడంతో న్యాయాధికారి నిందితుడికి శిక్షను ఖరారు చేశారు. నిందితుడు గత ఏడాది, జనవరి 14 నుంచి ఇప్పటి వరకు 380 రోజులుగా జుడిషియల్ రిమాండ్‌లోనే ఉన్నాడు. కేసు విచారణ వేగంగా పూర్తి చేసి రికార్డు సమయంలోనే శిక్ష ఖరారు చేశారు.

గౌరవనీయమైన ఉద్యోగం చేస్తూ…

గౌరవనీయమైన ఉద్యోగంలో ఉంటున్న నిందితుడికి పోక్సో చట్టంలో వివిధ సెక్షన్ల కింద శిక్షను ఖరారు చేశారు. పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎల్), 5 (ఎం). 5 (ఎన్), సెక్షన్ 6 కింద మరణించే వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా సెక్షన్ 14 (2) కింద జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా, సెక్షన్ 15 కింద రూ.30 వేల జరిమానా, సాధారణ జైలు శిక్ష చొప్పున మొత్తం రూ.50 వేల జరిమానా విధించారు.

ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయన్నారు. జరిమానా మొత్తం బాలికకు అందేలా చూడటంతో పాటు బాలికకు రూ. 5లక్షలు పరిహారం వచ్చేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.

కోర్టు శిక్షను విధించిన సమయంలో నిందితుడు శిక్షను తగ్గించాలని వేడుకున్నా న్యాయమూర్తి నిరాకరించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలకు కఠిన శిక్షలే పరిష్కారమన్నారు. బాధిత బాలికతో పాటు ఆమె సోదరి బాగోగులు సీడబ్ల్యూస్ (వైల్డ్ వెల్ఫేర్ కమిటీ) చూడాలని పేర్కొన్నారు. చిన్నా రులపై జరిగే నేరాల్లో సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన తండ్రి నిందితుడిగా ఉండటం తీవ్రమైన అంశమని న్యాయాధికారి పేర్కొన్నారు. శిక్ష తగ్గింపు కుదరదని తేల్చారు.

కూతురిపై కన్నేసి….

విజయవాడ మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారైలు ఉన్నారు. 13ఏళ్ల పెద్ద కుమార్తె హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె సోదరి ఆరో తరగతి చదువుతోంది.

పెద్ద కుమార్తెను మూడేళ్లుగా నిందితుడు లైంగికంగా వేదిస్తుండే వాడు. ఇంట్లో భార్య లేని సమయాల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించే వాడు. బాలిక పదేళ్ల వయసు నుంచి ఇలా ప్రవర్తించే వాడు.

నిందితుడి ఫోన్లో కుమార్తెనగ్న ఫొటోలను చూసిన బాలిక తల్లి నిలదీస్తే.. అవి మార్ఫింగ్ చిత్రా లని డిలీట్ చేశాడు. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె ఇద్దరు కుమార్తెలను హాస్టల్లో చేర్పించింది. 2023 జనవరి 7న బాధిత బాలిక ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి బాలికను నిందితుడు బెల్టుతో విపరీతంగా కొడుతుండడంతో తల్లి అడ్డుకుంది.

దూరంగా ఉండటంపై ఆగ్రహం…

తనకు దూరంగా ఉంటోందని కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. దీంతో మరుసటి రోజు బాలికను తల్లి హాస్టల్లో వదిలి పెట్టింది. జనవరి 10న బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు బ్యాంకుకు తీసుకువెళుతున్నట్టు చెప్పి బాలికను తన బైక్ ఎక్కించుకుని ఇంటి నుంచి దూరంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు.

ఆ సమయంలో ఎదురు తిరిగిన కుమార్తెను కర్రతో కొట్టి హింసించాడు. అత్యాచారం దృశ్యాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఇంటికి వచ్చిన. తర్వాత తల్లికి జరిగిన దారుణం గురించి వివరించింది. ఆమె "తన భర్తను నిలదీయడంతో వారిని చంపేస్తానని బెదిరించాడు. భయ పడిన బాలిక తల్లి రెండు రోజుల తర్వాత 12వ తేదీన దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఎదురు తిరిగిన సాక్షులు…

ఈ కేసులో బాలికతో పాటు ఆమె తల్లి, బాలిక సోదరి , బందువులను పోలీసులు సాక్షులుగా చేర్చారు. వీరంతా దర్యాప్తులో ఘటన గురించి వివరంగా చెప్పారు. పోలీసులు వారి స్టేట్ మెంట్లను వీడియో రికార్డు చేశారు. కేసు విచారణలో మాత్రం సాక్షులు అడ్డం తిరిగారు. తాము గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా చెప్పారు. పోలీసులు న్యాయస్థానంలో సాంకేతిక ఆధారాలు ప్రవేశపెట్టడంతో పాటు అత్యాచారం జరిగిన సమయంలో సేకరించిన ఆధారాలు బలంగా ఉండడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేశారు.

నిందితుడి ఫోన్‌లో డిలీట్ చేసిన వీడియోలను రిట్రైవ్ చేశారు. అందులో బాలిక నగ్న చిత్రాలను గుర్తించారు. నిందితుడు ధరించిన వస్త్రాలతో పాటు బాలిక వస్త్రాలపై సేకరించిన డిఎన్‌ఏ నమూనాలు సరిపోయాయి. ఘటన జరిగిన సమయంలో బాలికను తీసుకు వెళుతున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సాక్ష్యులు అడ్డం తిరిగినా బలమైన ఆధారాలతో శిక్షలను న్యాయస‌్థానం ఖరారు చేసింది.