Kakinada Crime : కాకినాడ జిల్లాలో బాలిక మిస్సింగ్.. ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు.. అసలు కథ ఇదీ!
Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ప్రతి రోజూ స్కూల్‌కి తీసుకెళ్లి, తీసుకొచ్చే ఆటో డ్రైవరే.. బాలికను అపహరించాడు. దాదాపు ఎనిమిది రోజులుగా బాలిక ఆచూకి తెలియలేదు. దీంతో బుధవారం ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవా ఉన్నాయి.
కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలిక.. ఒమ్మంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలికను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రతి రోజూ పాఠశాలకు తీసుకెళ్లి.. తీసుకొచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఆ బాలిక గతనెల 30న పాఠశాలకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతిపాడు ఎస్ఐ ఎస్. లక్ష్మీకాంతం మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే బాలికను నిత్యం పాఠశాలకు తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ పెద్దిరెడ్డి కృప అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బాలిక మిస్సింగ్ కాస్త పోక్సో కేసు అయ్యింది. ఆటో డ్రైవర్ పెద్దిరెడ్డి కృపపై బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. కేసును పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరావుకు బదిలీ చేశారు. ఆయన ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య..
బడికి ఎందుకు వెళ్లడం లేదని మందలించినందుకు ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాలపట్నం పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం మండల పరిధిలోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్న దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. కుమారులిద్దరినీ బాగా చదివించుకోవాలనే తపనతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించారు.
చిన్న కుమారుడు (12) కొత్తపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు తరచూ డుమ్మా కొడుతుండటంతో పాటు చదువుల్లోనూ బాగా వెనుకబడుతున్నాడు. దీనిపై కుమారుడిని పలుమార్లు తల్లిదండ్రులిద్దరూ మందలించారు. అయినప్పటికీ అదే తీరుగా ఉంటున్నాడు. స్కూల్‌కి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. దీంతో బుధవారం మరోసారి మందలించారు. దీంతో బాలుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
తీవ్ర ఆందోళనకు గుగైన తండ్రి వెంటనే కుమారుడిని కిందకు దింపి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు తమకు దూరమైపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గోపాటపట్నం సీఐ కె.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)