Visakhapatnam Crime : ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం - గర్భం దాల్చడంతో వెలుగులోకి..!
విశాఖపట్నంలో ఘోరం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక గర్భం దాల్చడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విశాఖలోని ఒక ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన సీహెచ్ సీతయ్య గత ఏడాదిగా బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుంటున్నాడు. ఈ ఏడాది జనవరిలో బాలికను వేరేవాళ్ల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత కూడా బాలికపై పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు.
గర్భం దాల్చటంతో…
ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అయితే గర్భం దాల్చినట్లు ఆమెకే తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లలేదు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన ఆమె తల్లి అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసియడంతో బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. అప్పుడు బాలికను తల్లి నిలదీసింది. దీనికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించడంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లి ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సీతయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టుకుని విచారించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారిని ప్రేమ పేరుతో వంచించాడని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
డైట్ కాలేజీ విద్యార్థినికి వేధింపులు:
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) విద్యార్థినిపై ఉపాధ్యాయుడు గత 20 రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. సదరు విద్యార్థిని కాలేజీ హాస్టల్లోనే ఉండేది. ఇక్కడ డిప్యూటేషన్‌పై బోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కె.హరికిరన్ గత 20 రోజులుగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. విద్యార్థినితో అనుచితంగా మాట్లాడటం, ప్రవర్తించడం, ఆడియో, వీడియో కాల్స్ చేయడం, ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడం, అభ్యంతరకం మెసేజ్‌లు పంపడం చేస్తున్నాడు.
ఈ వేధింపులను తాను భరించలేని, ఆత్మహత్య చేసుకుంటానని తోటి విద్యార్థినులకు తన బాధను చెప్పుకుని బాధపడింది. తోటి విద్యార్థుల సూచనలతో ప్రిన్సిపల్ సలీం బాషాకు ఫిర్యాదు చేసింది. హరికిరణ్ ఆమె మొబైల్‌కి పంపిన సంభాషణలు, ఆడియో, వీడియోలను అందించింది. దీంతో ఆమె ఫిర్యాదును ప్రిన్సిపల్ నేరుగా ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో హరికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) రామారావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను డైట్ ప్రిన్సిపల్, ఎంఈవో, హెచ్ఎంలకు పంపారు.
ఆయనపై పోలీసు కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.