కుటుంబ బాంధవ్యాలకు విఘాతం కలిగించి, కనీసం మానవత్వం కూడా లేకుండా కొంత మంది ప్రవర్తిస్తున్నారు…! బంధుత్వాన్ని అలుసుగా తీసుకుని ఓ చిన్నారి అశ్లీల వీడియోలను చిత్రీకరించాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు..ఆ చిన్నారి తల్లిని బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు.
ఈ ఘటన విశాఖపట్నంలోని తగరపువలస పరిధిలోని వలందపేట (జీవీఎంసీ రెండో వార్డు)లో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భీమిలి పోలీసులు వెల్లడించారు.
వలందపేటకి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయిని (33), ఆమె కుమార్తె (15)లు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అయితే వీరి సమీప బంధువైన గొరక జానకిరావు గత అక్టోబర్ లో వారి ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటున్న బాలికను చూశాడు. రహస్యంగా తన మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీశాడు.
ఈ వీడియోలను చూపించి బాలిక తల్లిని బ్లాక్ మెయిల్ చేశాడు. నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. పదేపదే ఫోన్ చేసి కుమార్తె నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ బెదిరించాడు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ… పలు దఫాలుగా రూ.5.60 లక్షల నగదును కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే బాలిక తల్లిని శారీరకంగా లోబర్చుకున్నాడు.
అక్కడితో ఆగకుండా భర్తను వదిలి తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అతగాడి వేధింపులు మితిమీరడంతో బాధితురాలు మానసిక వేదనకు గురైంది. వేధింపులను తాళలేక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.
కుటుంబ సభ్యులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చారు. బాధితురాలి వద్ద ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు… నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
సీఐ బి. సుధాకర్ స్పందిస్తూ.. పోక్సో కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. అలాగే నిందితుడిని అరెస్టు చేశామని.. న్యాయస్థానంలో హాజరపరిచినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆరు నెలల రిమాండ్ విధించిందని వవరించారు.
సంబంధిత కథనం