Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం.. బాలికపై యువకుడు అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో నమ్మించి బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన తరువాత దాన్ని తొలగించాడు. బాలికపై దాడి చేసి, మళ్లీ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడి మోసాన్ని గ్రహించిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాచలం మండలం కనుపూరు పంచాయతీ జ్యోతినగర్‌కు చెందిన మొండెం కృష్ణవంశీ.. ఒక బాలిక (16)కు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఆ బాలిక నమ్మకపోయేసరికి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. తాను గర్భం దాల్చానని మొండెం కృష్ణవంశీకి బాలిక చెప్పింది. అతడు గర్భం తొలగించాలని నిర్ణయించుకున్నాడు.

దాడి చేసి..
అందులో భాగంగానే బాలిక చేత గర్భనిరోధక మాత్రలను బలవంతంగానే మింగించాడు. జనవరి 21 (మంగళవారం)న బలవంతంగా ముత్తుకూరు మండలం మామిడిపూడికి బాలికను తీసుకెళ్లాడు. అక్కడ బాలికను దారుణంగా కొట్టి మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కృష్ణవంశీ మోసం చేస్తున్నాడని పసిగట్టిన బాలిక.. ఇక లాభం లేదనుకుని సోమవారం వెంకటాచలం పోలీసులకు ఆశ్రయించింది. కృష్ణవంశీ అత్యాచారం చేశాడని, గర్భం దాల్చిస్తే దాన్ని బలవంతంగా తొలగించాడని ఫిర్యాదు చేసింది.
పోక్సో కేసు నమోదు..
ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాడి చేసి బలవంతంగా అత్యాచారం చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. నిందితుడు కృష్ణవంశీపై పోక్సో కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో కేసు కావడంతో ఈ కేసును డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం..
నెల్లూరు నగరంలో ఎనిమిదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాకు చెందిన ఓ బాలిక నెల్లూరు నగరంలోని ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. స్కూల్‌కు సమీపంలో ఉండే యువకుడు బాలికకు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ కొనిస్తూ దగ్గర అయ్యాడు. ఈనెల 25 (శనివారం) తేదీన బాలికను ఆ వ్యక్తి సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లాడు.
కేకలు వేయడంతో..
అక్కడ ఆ బాలిక పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి ఆ యువకుడు పరారయ్యాడు. అటుగా వచ్చిన మరో యువకుడు బాలికను వివరాలు అడిగి, హాస్టల్లో వదిలిపెడతానని తన వెంట తీసుకెళ్లాడు. ఆ యువకుడు కూడా బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి కూడా ఎలాగోలా తప్పించుకుంది. స్కూల్‌కు వెళ్లిన బాలిక సాయంత్రం అయినా హాస్టల్‌కు రాకపోవడంతో.. వార్డెన్ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
బస్ కాంప్లెక్స్ వద్ద ఏడుస్తూ..
తల్లిదండ్రులు జనవరి 26వ తేదీన నెల్లూరు చేసుకుని.. స్థానిక సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాలిక ఆత్మకూరు బస్ కాంప్లెక్స్ వద్ద ఏడుస్తూ కనిపించింది. బాలికను పోలీసులు సంరక్షించారు. బాలిక నుంచి వివరాలను అడిగి పోలీసులు తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసును పోక్సో కేసుగా మార్చారు. నిందితులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)