నిడదవోలులో దారుణ హత్య జరిగింది. నాలుగేళ్ల క్రితం ఇంటర్ బాలికను వేధించిన కేసులో అరెస్టైన నిందితుడు పోక్సో కేసులో శిక్ష నుంచి తప్పించుకోడానికి బాధితులతో రాజీ కుదుర్చుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో యువతి తండ్రిపై పగ పెంచుకుని మాటు వేసి హత్యకు పాల్పడ్డాడు.
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన లారీ డ్రైవర్ చివరకు ఆమె తండ్రిని హత్య చేసిన ఘటన నిడదవోలులో ఆదివారం జరిగింది. పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మాటు వేసి బాలిక తండ్రిని హత్య చేశాడు.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. నిడదవోలు సీఐ తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలు చింతచెట్టు వీధికి చెందిన షేక్ వల్లీభాషా వంట పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు 2021లో స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో లారీ డ్రైవర్ వెంటపడి వేధించే వాడు.
నిడదవోలు వైఎస్సార్ కాలనీకి చెందిన సిరంగుల అనిల్‌కుమార్‌పై వల్లీభాష పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు బెయిల్‌పై ఉన్నాడు. పోక్సో కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ క్రమంలో పోక్సో కేసు వల్ల వివాహం కాకపోవడం, శిక్ష ఖరారైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇటీవల రాజీ ప్రయత్నాలు చేశాడు.
వల్లీ భాష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. తన ప్రతిపాదన అంగీకరించకపోతే చంపుతానని బెదిరించాడు. దీనికి వల్లీభాష ఒప్పుకోలేదు. ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో షాపు తెరిచేందుకు వచ్చిన భాషపై నాటు కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచేశాడు.
గొంతు కోయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య చేసిన అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కైన వల్లీభాష ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
సంబంధిత కథనం