Manyam district : బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో నమోదు.. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
Manyam district : పార్వతీపురం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయింది. పోలీసుల అదుపులోంచి నిందితుడు తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన కర్రి అప్పడు, గౌరీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రాకేష్ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద కుమారుడు రామకృష్ణ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కర్రి రాకేష్ గ్రామంలోనే ఒక మైనర్ బాలికపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి అత్యచారం చేశాడు.
ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి యువకుడు పరారయ్యాడు. పరారీలో ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పార్వతీపురం రూరల్ ఎస్ఐ దినకర్ మంగళవారం రాత్రి.. స్టేషన్‌కు తీసుకువచ్చారు.
నిందితుడు పరార్..
నిందితుడు రాకేష్ పోలీసుల కన్నుగప్పి స్టేషన్ నుంచి తప్పించుకొని పరారయ్యాడు. పరారైన విషయాన్నినిందితుడి కుటుంబీకులకు పోలీసులు చెప్పారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఉదయం పట్టాలపై ఓ శవం కనిపించింది. మృతిచెందింది రాకేష్‌గా పోలీసులు గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుమారుని మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని బయటకు ఎలా వదులుతారని మృతుని తల్లిదండ్రులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. యువకుడి మృతికి పోలీసులే బాధ్యత వహించాలని కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ అంకితాసురాన, సీఐ గోవిందరావు సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వివరించారు.
ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం..
అమలాపురం జిల్లాలోను ఓ పోక్సో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అమలాపురం జిల్లా కొత్తపేట మండలానికి చెందిన వరసాల కృష్ణబాబు (22) కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు.
కొత్తపేట మండలంలోనే ఓ గ్రామానికి చెందిన బాలిక (17) కృష్ణబాబుకు పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తానున్నానని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. డీఎస్పీ వై.గోవిందరావు విచారణ జరిపి యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరచగా.. విచారణ జరిపిన కోర్టు నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)