PM SVANidhi Scheme : ఆధార్ కార్డుపై ఎలాంటి హామీ లేకుండా రూ.50 వేల రుణం, దరఖాస్తు విధానం ఇలా?
PM SVANidhi Scheme : ఆధార్ కార్డుపై ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. పీఎం స్వనిధి పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు లోన్లు ఇస్తున్నాయి. సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే మరోసారి రుణం మంజూరు చేస్తారు.
PM SVANidhi Scheme : కోవిడ్ మహమ్మారి సమయంలో చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు చితికిపోయారు. చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏ విధమైన గ్యారంటీ లేకుండా చిరు వ్యాపారులకు రుణం అందిస్తారు. మొదట్లో ఈ పథకం కింద 10 వేల రూపాయల రుణం అందించేవారు. ఈ స్కీమ్ లో అత్యధికంగా రూ.50 వేల వరకు రుణాన్ని ఇస్తారు.
కేవలం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు రుణం పొందవచ్చు. తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. స్వనిధి పథకంలో రుణం పొందేందుకు గ్యారంటీ, ష్యూరిటీ అవసరం లేదు. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సులభమైన వాయిదాలలో చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో చెల్లిస్తే రుణ పరిమితి పెరుగుతుంది. పీఎం స్వనిధి పథకంలో గడువు 12 నెలలు ఉంటుంది. వడ్డీ రుణం తీసుకునేటప్పుడు నిర్ణయిస్తారు.
మొదట్లో వీధి వ్యాపారులకు రూ. 10,000 వరకు రుణం ఇచ్చేవారు. వారు ఈ లోన్ సమయానికి తిరిగి చెల్లిస్తే, తదుపరి రూ.20,000 రుణం అందించేవారు. అలాగే మునుపటి లోన్‌ను సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత ఈ మొత్తం రూ. 50,000కి పెంచుతారు.
పీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. చిరు వ్యాపారులు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోనే ముందు
1. పీఎం స్వనిధి పథకంలో లోన్ పొందేందుకు దరఖాస్తుదారులు లోన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయడానికి అవసరమైన సమాచారం సిద్ధం చేసుకోవాలి.
2. మొబైల్ నంబర్‌ను ఆధార్‌కి లింక్ చేసుకోవాలి.
3.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఇ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దరఖాస్తుదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల నుంచి సిఫార్సు లేఖను పొందాల్సి ఉంటుంది.
4.మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేయడానికి ఫారమ్‌ను పూర్తి చేయాలి.
5. రుణం పొందేందుకు ముందుగా అర్హతను చెక్ చేసుకోవాలి. ఈ పథకంలో రుణం పొందడానికి నాలుగు రకాల వ్యాపారులు అర్హులుగా ఉన్నారు. అర్హత ప్రమాణాలను తనిఖీ చేసి, తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.
6.ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత, పీఎం స్వనిధి పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణం తీసుకునేవారు నేరుగా ఆన్ లైన్ పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వడ్డీ రేటు
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు.
కనీస వయస్సు
ఈ పథకంలో రుణం పొందేందుకు రుణగ్రహీతకు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.