ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ టూర్ పై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో…. డ్రోన్ సిటీకి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షో నిర్వహించాలని నిర్ణయించారు.
డ్రోన్ల వినియోగానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రైవేటు వినియోగం కూడా పెరిగేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భాగంగా పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిసింది. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ జూన్ నెలలో కూడా విశాఖలో పర్యటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కలిసి యోగాసానాలు వేశారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి పాల్గొంటారని తెలిసింది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కూటమి నేతలు ఇందులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంపై క్లారిటీ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం