జూన్‌ 21న విశాఖ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. 5లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ-pm modi in visakhapatnam on june 21 yoga day event ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  జూన్‌ 21న విశాఖ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. 5లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

జూన్‌ 21న విశాఖ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. 5లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

Sarath Chandra.B HT Telugu

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన్‌ 21న విశాఖలో 5లక్షల మందితో భారీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 5లక్షల మంది ప్రత్యక్షంగా, 2కోట్ల మందిని వర్చువల్‌గా ఈ వేడుకల్లో భాగం చేస్తారు.

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లు (PTI)

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గోనే వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు వివిధ అంశాలపై అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద 5లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 2కోట్ల మంది భాగస్వాములయ్యేలా చూడాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడకుల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సర్కులర్ ఆదేశాలు, జిఓలను జారీ చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.

2023లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఒకే ప్రాంతంలో లక్షా 53వేల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించగా ఆ వేడుకల్లో మొత్తం కోటి 25 లక్షల మంది భాగస్వాములు అయ్యారని అధికారులు వివరించారు.

జూన్ 21న విశాఖ ఆర్కె బీచ్ లో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ప్రధాన వేదిక వద్ద ప్రత్యక్షంగా 5లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

యోగాకు విస్తృత ప్రచారం..

రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2కోట్ల మంది భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఈఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని”Yoga for One Earth, One Health’ అనే నినాదంతో యోగాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈనెల 21 నుండి జూన్ 21 వరకూ నెల రోజులపాటు ప్రతి ఒక్కరూ యోగాను ఆసరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.

ఈకార్యక్రమాన్ని మూడు దశలుగా చేపట్టనున్నట్టు అనగా ఈనెల 21 నుండి 27 వరకూ ప్రాధమిక దశ కింద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ, 28 నుండి జూన్ 3 వరకూ మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ, జూన్ 4 నుండి 16వరకు గ్రామ,వార్డు స్థాయిల్లో శిక్షణ నిర్వహిస్తారు.

ఈనెల 21న అన్నిజిల్లాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి కనీసం 10 వేల మంది ప్రజాప్రతినిధులు, యోగా శిక్షకులు,పిఇటిలు,యోగా అబ్యాసకులు తదితరులతో కర్టెన్ రైజర్ ఈవెంటను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 27న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశమై వారి భాగస్వామ్యంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 100 పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం