ప్రధాని మోదీ ఏపీ టూర్‌ ఖరారు - కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా-pm modi ap tour schedule finalized full details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రధాని మోదీ ఏపీ టూర్‌ ఖరారు - కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా

ప్రధాని మోదీ ఏపీ టూర్‌ ఖరారు - కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా

ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అంతేకాకుండా సాయంత్రం కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈనెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ… సాయంత్రం జరిగే భారీ సభలో కూడా ప్రసంగింస్తారు. తాజాగా ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

మోదీ పర్యటన ఇలా…

ఈనెల 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బయల్దేరుతారు. ఉదయం 10.20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఆ తర్వాత 10.25 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి సున్నిపెంట హెలిప్యాడ్‌కు బయల్దేరుతారు.

ఉదయం 11.05 గంటలకు సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉదయం 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఉదయం 11.45కి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.45కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకొని 1.25కి సున్నిపెంటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్ కు వస్తారు.

మధ్యాహ్నం 2.30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు చేరుకొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక సాయంత్రం 4.00 గంటల వరకు కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 4.15కి రోడ్డు మార్గంలో నన్నూరు హెలిపాడ్‌కు చేరుకుంటారు. హెలికాఫ్టర్‌లో 4.40కి కర్నూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని… అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. దీంతో ప్రధాని మోదీ ఏపీ టూర్ ముగుస్తుంది.

సభకు భారీ ఏర్పాట్లు….

కేంద్రం తెచ్చిన జీఎస్టీ -2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది.

ఈ సభ నిర్వహాణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని... సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం