పీఎం కిసాన్ డబ్బులు, ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏంచేయాలి?-pm kisan scheme 20th installment what should farmers do to get funds ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పీఎం కిసాన్ డబ్బులు, ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏంచేయాలి?

పీఎం కిసాన్ డబ్బులు, ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏంచేయాలి?

పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తి చేయాలి.

పీఎం కిసాన్ డబ్బులు, ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏంచేయాలి?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తుంది. 2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకూ 19 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించారు. మరికొన్ని రోజుల్లో పీఎం కిసాన్ 20వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పీఎం కిసాన్ 20వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంది. ముందు రైతుల బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ చేయాలి. దీంతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకుని 11 అంకెల నెంబర్ పొందాలి. ఆపై ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లో నగదు పడనుంది.

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు?

పీఎం కిసాన్ నిధులను ప్రతీ ఏటా మూడు విడతల్లో విడుదల చేస్తారు. అంటే 4 నెలల వ్యవధిలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తారు. 18వ విడత గతేడాది అక్టోబర్ నెలలో, 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైంది. 20వ విడత జూన్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

రైతులకు రూ.2 వేలు పడాలంటే?

రైతులు e-KYC చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు. గతంలో ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసీ పూర్తి అయ్యేది. ప్రస్తుతం బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి. ఇందుకు మీ సమీపంలోని CSC కేంద్రం లేదా మీ-సేవను సందర్శించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ముందుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

  • పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
  • రైతులు ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్‌తో లింక్ చేయాలి. రైతులు బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
  • పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఈ-కేవైసీ పూర్తి చేయాలి.
  • ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరి
  • ఈ మూడు పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులకు 11 అంకెల గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అంటే?

ఆధార్ కార్డు తరహాలో రైతులకు ఓ ప్రత్యేక డిజిటల్ ఐడీ కార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్డును రైతు ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, పంటలు, అప్పులు, పీఎం కిసాన్ లబ్ధి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

ఈ కార్డుతో లాభాలు

ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుతో బ్యాంకు రుణాలు సులభంగా పొందవచ్చు. గతంలో రైతులు రుణాల కోసం పట్టాదారు పాసుపుస్తకం, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే బ్యాంకులు రుణాలు అందిస్తాయి.

పీఎం కిసాన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇతర వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చు.

రైతు పేరు, భూమి, పంటల వివరాలు, ఇతర సమాచారం ఒకే చోట పొందవచ్చు.

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు, ఫోన్ నంబర్‌ను ఏపీలో అయితే గ్రామ, వార్డు సచివాలయంలో, తెలంగాణలో మండల వ్యవసాయ విస్తరణాధికారికి అందిస్తే వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు జారీ చేస్తారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం