Plastic Flex Ban In AP : నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలు
Andhra Pradesh Plastic Flex Ban : ఏపీ ప్రభుత్వం నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల దిగుమతి, ఉత్పత్తికి అనుమతి లేదని పేర్కొంది.
ప్లాస్టిక్ ఫ్లెక్సీ(Plastic Flex)లపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నవంబర్ 1 నుంచి నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఫ్లెక్సీల వినియోగం, ప్రదర్శన, ముద్రణ, రవాణా వంటివాటిపై నిషేధం పెట్టారు. నగరాలు, పట్టణాల్లో అధికారులు దీనికి బాధ్యత వహించాలని ప్రభుత్వం చెప్పింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై పెట్టింది ప్రభుత్వం. నిబంధనను అతిక్రమించిన వారికి రూ. 100 జరిమానా(Fine) వేస్తారు. ఎవరైనా.. ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. నిషేధాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, జీఎస్టీ అధికారులు, రవాణా శాఖ అధికారులపై ఉందని ప్రభుత్వం చెప్పింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బదులుగా కాటన్ ఫ్లెక్సీలు, నేత వస్త్రాలు వాడాలని సూచించింది.
సీఎం జగన్(CM Jagan) ఇటీవల విశాఖపట్నంలోని బీచ్ లో వ్యర్థాలను వేరుచేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ప్లెక్సీలు బ్యాన్(Plastic Flex Ban) చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. ఎవరైనా ప్లెక్సీలు పెట్టాలనుకుంటే బట్టతో తయారు చేసినవి ఏర్పాటు చేసుకోవాని సూచించారు. టీటీడీలో ఇప్పటికే ప్లాస్టిక్ లేకుండా చేశారని అక్కడ మంచి రిజల్ట్ కూడా వస్తోందని గుర్తు చేశారు. అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్‌లు(Plastic Bags) లేవన్న సీఎం అన్నీ కూడా బట్టతోనే బ్యాగుల్లోనే అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ దిశగా అడుగులు వేద్దామని ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంలో భాగంగా.. నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సిల నిషేధం అమలులోకి రానుంది.
రాష్ట్రవ్యాప్తంగా 4,097 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్(CM Jagan) వెల్లడించారు. ఈ రోజు సముద్రాలను పరిశీలిస్తే..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తోందని.. వీటికి ఒక పరిష్కారం వెతికే దిశగా ఏపీ సర్కార్(AP Govt) అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు కంపెనీలను భాగస్వాములుగా ఆహ్వానించిందని.. ఒకటి గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టేయినబుల్ ప్లానెట్ వర్క్స్(జీఏఎస్‌పీ), మరొకటి పార్లే ఓషన్స్ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలు గ్లోబల్ ఫైనాన్స్ తీసుకువచ్చి పర్యావరణాన్ని కాపాడే విధంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు.