Tirumla Darshans: తిరుమలలో మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు, గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు
Tirumla Darshans: గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. రెండు,మూడు రోజుల ముందే తిరుమల చేరుకున్న భక్తులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.వైైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శనం భారీగా వచ్చారు.
Tirumla Darshans: తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు మొదలయ్యాయి. శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరిచారు.అర్థరాత్రి 12.05 గంటల సమయంలో తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారువాకిలి తలుపులను వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ తెరిచారు. రాత్రి 12.25 గంటల సమయంలో తిరుమల వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతులు సమర్పించారు. అనంతరం తోమాల పటంతో ప్రదక్షణగా గర్భగుడిని చేరుకున్నారు. శ్రీవారి మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేశారు.
అనంతరం ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు సమర్పించారు. శుక్రవారం వేకువజామున అభిషేకం, అలంకారం, తోమాల అర్చన, నైవేద్యం నిర్వహించి తెల్లవారుజామున 4.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచే తిరుమలలో వీఐపీల హడావుడి ఉంటుంది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో విఐపిల హడావుడి కాస్త తక్కువగా కనిపించింది.
గురువారం రాత్రి 7 గంటల వరకు కూడా తిరుమలలో రద్దీ సాధారణంగానే కనిపించింది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు కూడా తిరుమలకు పరిమితంగానే చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల ముందే తిరుమలకు చేరుకోవాల్సి రావడంతో భక్తులు అలసిపోయారు.
జనవరి 10వ తేదీ శుక్రవారం నుంచి మొదలయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. తిరుమలలో స్థానికులకు గురువారం తెల్లవారుజాము వరకు దర్శనం టోకెన్లు జారీ చేశారు. గురువారం ఉదయం 4.50 గంటల నుంచి సాయంత్రం వరకు 1,700 టోకెన్లు జారీ చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని స్థానికేతరులెవ్వరూ తిరుమలలోని టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణతో అలంకరించారు.