తిరుమలలో భక్తుల రద్దీ - నిండిపోయిన కంపార్టుమెంట్లు, దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే...-pilgrim rush continuing in tirumala latest updates here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమలలో భక్తుల రద్దీ - నిండిపోయిన కంపార్టుమెంట్లు, దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే...

తిరుమలలో భక్తుల రద్దీ - నిండిపోయిన కంపార్టుమెంట్లు, దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ రావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఫలితంగా క్యూలైన్లన్నీ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

తిరుమలలో భక్తులు (ఫైల్ ఫొటో)

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ కావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో శ్రీనివాసుడి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.

నిండిపోయిన కంపార్టుమెంట్లు…

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం బయటి వరకు లైన్ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం తిరుమల శ్రీవారిని 90,087 భక్తులు దర్శించుకున్నారు. 41,891 మంది భక్తులు తలనీలాలను సమర్పించగా… హుండీ కానుకలు రూ. రూ 4.30 కోట్లుగా ఉంది. ఇక భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.

తిరుపతిలో శ్రీపెరియాళ్వార్‌ ఉత్సవం :

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీపెరియాళ్వార్‌ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 26 నుండి జూలై 05వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్‌వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు.

చివరి రోజైన జూలై 05వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీగోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్‌ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్‌ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్‌ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్‌ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.