Sankranti Pig Fight : కోడి పందాలు కామన్ గురూ.. పందుల ఫైటింగ్ ట్రెండింగ్ ఇప్పుడు! ఎక్కడో తెలుసా?
Sankranti Pig Fight : సంక్రాంతి పండగ వచ్చిందంటే.. ఏపీలో కోడి పందాలు చాలా స్పెషల్. కానీ ఇప్పుడు కోడి పందాలు కామన్ అయ్యాయి. తాజాగా పందుల ఫైటింగ్ తెరపైకి వచ్చింది. అది కూడా ఏపీలోనే. ఈ పందుల పోటీలను చూసేందుకు జనం ఎగబడ్డారు. మరి పందుల ఫైటింగ్ ఎందుకు, ఎక్కడో ఓసారి చూద్దాం.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అందుకు కారణం పందుల ఫైటింగ్. అవును సంక్రాంతి పండగ సందర్భంగా ఇక్కడ పందుల ఫైటింగ్ నిర్వహించారు. ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించి.. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

రసవత్తరంగా పోటీలు..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందుల మధ్య పోటీలు రసవత్తరంగా జరిగాయి. కోనసీమ జిల్లా వలస గ్రామం, నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామం మధ్య పోటీలు నిర్వహించగా.. బుచ్చి గ్రామానికి చెందిన పంది విజేతగా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొమ్ముగూడెం, తిరుపతిపాడు గ్రామాల పందుల మధ్య పోటీ నిర్వహించగా.. తిరుపతిపాడుకు చెందిన పంది విజేతగా రెండో స్థానంలో నిలిచింది.
తాడేపల్లిగూడెం విజయం..
ఇటు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, మండపేట గ్రామాలకు చెందిన పందులు బరిలోకి దిగగా.. మండపేట గ్రామానికి చెందిన పంది విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామాల మధ్య పోటీ జరగ్గా.. తాడేపల్లిగూడెం విజయం సాధించింది.
సపోర్ట్ కావాలి..
ఈ సందర్భంగా నిర్వాహకులు సుబ్బారావు మాట్లాడుతూ.. 'సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తారు. కానీ వాటికి కత్తులు కట్టి రక్తం చిందేలా చేస్తారు. కొన్ని కోళ్లు చనిపోతాయి. మేము అలా చేయం. కత్తులు కట్టకుండా, ప్రాణహాని లేకుండా పోటీలు నిర్విహిస్తాం. ఈ పోటీలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కావాలి' అని కోరారు.
పడవ పోటీలు..
సంక్రాంతి సందర్భంగా.. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో.. ఆత్రేయపురంలో పడవ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 11 జట్లు పాల్గొన్నాయి. ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు వెయ్యి మీటర్ల పరిధిలో డ్రాగన్ బోట్ రేస్, కనోయింగ్ బోటింగ్ పోటీలు నిర్వహించారు. ఒక్కో పడవలో 12 మంది చొప్పున పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.