GO No 77 Issue: కూటమి సర్కారులోను పీజీ చదువుకు కష్టాలే… జీవో నంబర్ 77తో పేదలకు పీజీ చదువులు దూరం-pg studies are difficult with go no 77 in ap pg studies are out of reach for the poor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Go No 77 Issue: కూటమి సర్కారులోను పీజీ చదువుకు కష్టాలే… జీవో నంబర్ 77తో పేదలకు పీజీ చదువులు దూరం

GO No 77 Issue: కూటమి సర్కారులోను పీజీ చదువుకు కష్టాలే… జీవో నంబర్ 77తో పేదలకు పీజీ చదువులు దూరం

Sarath Chandra.B HT Telugu

GO No 77 Issue: ఉన్నత విద్యలో పేద విద్యార్ధుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్‌ 77పై కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో ఏపీలో వరుసగా రెండో ఏడాది కూడా పేద విద్యార్ధులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. జీవో 77 రద్దు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కాకపోవడంతో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పడిపోయాయి.

జీవో 77తో పీజీ కోర్సుల్లో పడిపోయిన అడ్మిషన్లు

GO No 77 Issue: వైసీపీ హయంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే జారీ చేసిన ఓ జీవో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్ధుల పాలిట శాపంగా మారింది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది. దీనిపై అప్పట్లో టీడీపీ విద్యార్ధి విభాగాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి.

2020 డిసెంబర్ 25వ తేదీన ఈ జీవో జారీ చేశారు. వరుసగా ఆరో ఏడాది కూడా ఈ జీవో పేద, బలహీన వర్గాల విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. జీవోను ఉపసంహరించుకోవాలని విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలకు, సీఎంఓ బాధ్యులకు విజ్ఞప్తి చేశాయి. జీవో 77 సవరిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం అమలు కాలేదు.

పేద విద్యార్ధుల అవకాశాలకు గండి…

ఏపీలో 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్‌ మెంట్ పథకాలకు జగనన్నవిద్యా దీవెన, వసతిదీవెన పథకాలుగా పేర్లు మార్చారు.

ఆ తర్వాత విద్యా రంగంలో పలు మార్పులు తీసుకు వచ్చారు. వీటిలో ప్రధానంగా పిల్లల్ని బడికి పంపే కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి అమ్మఒడి పేరుతో రూ.15వేలు చెల్లించారు.

పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్దులకు గతంలో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విద్యా దీవెన పేరుతో అమలు చేశారు. మెస్‌ ఛార్జీలను జగనన్న వసతి దీవెన పేరుతో చెల్లించారు. పేదల తలరాతల మార్చేలా విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని చెప్పుకున్నా, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.

పీజీ కోర్సులకు గండి కొట్టిన జగన్…

2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. 2020 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 77తో ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారికి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు, పీజీ కోర్సులు, సాంకేతిక కోర్సుల్లో ఫీజుల చెల్లింపు రద్దు చేశారు.

ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు అన్ని రకాల పీజీ కోర్సులు, సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింప చేయాలని నిర్ణయించారు.

కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్ధులకు మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీల్లో చేరినా పథకం వర్తించదని నిబంధన విధించారు. సెల్ఫ్ ఫైనాన్స్‌ కోర్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తింపచేశారు.

ఐదేళ్లుగా ఉన్నత చదువులకు దూరం..

ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్లుగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆంధ్రా, ఆదికవి నన్నయ్య, కృష్ణా, నాగార్జున, ఎస్కేయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల వంటి రాష్ట్ర ప్రభుత్వ వర్శిటీల పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజీలు, పీజీ కాలేజీలలో మాత్రమే విద్యార్దులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది.

బీసీలకు లేనపుడు ఎందుకని..

పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రియింబర్స్‌మెంట్‌, మెస్ ఛార్జీల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రాయితీ వర్తింపచేయడం అదే సమయంలో బీసీలు ఇతర వర్గాల విద్యార్ధులకు ఆ అవకావం లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు కూడా ఆ సదుపాయాన్ని రద్దు చేయాలనే వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అప్పట్లోనే విద్యాశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత ప్రభుత్వ ముఖ్యమైన వ్యకి తన ఆదేశాలు అమలు చేయాల్సిందేనని పీజీ కోర్సుల్లో ఫీజు రియంబర్స్‌మెంట్‌ రద్దు చేయాలని స్పష్టం చేయడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారు.

చేటు చేస్తున్న సంస్కరణలు….

గత ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తిని కొందరు అధికారులు, సలహాదారులు తప్పు దోవ పట్టించడంతో ప్రైవేట్, ఎయిడెడ్‌ కాలేజీలకు రియింబర్స్‌మెంట్‌ నిలిపివేయాలని నిర్ణయించారు. ఫలితంగా లక్షలాది మంది విద్యార్ధులు గ్రాడ్యుయేషన్‌తో చదువు ముగించాల్సి వచ్చింది. హాస్టల్‌ సదుపాయం, స్కాలర్‌షిప్‌ల కోసమే చాలా మంది అడ్మిషన్లు పొందుతున్నారనే అభిప్రాయాన్ని జీవో నంబర్ 77 జారీ చేసే సమయంలో వైసీపీ ముఖ్యనేత భావించడంతో భావనను ముఖ్యమైన వ్యక్తికి కల్పించడంతో జీవోను నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని సరిచేస్తామని కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గతంలో హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం అమలు కాలేదు.

జీవోను ఉపసంహరించాలని డిమాండ్…

పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులకు ఉన్నత చదువులు చదివే అవకాశాలను దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలని కొత్త ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ముఖ్యమంత్రి కార్యాలయ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ విద్యా సంవత్సరం పూర్తైపోయింది. రెండో ఏడాది ప్రవేశాలకు పలు నోటిఫికేషన్లు కూడా వెలువడ్డాయి. అయినా జీవో నంబర్ 77పై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

ఏపీలో తగ్గిన పీజీ అడ్మిషన్లు…

పీజీలో ఫీజు రియింబర్స్‌మెంట్‌ లేకపోవడంతో 2024-25 పీజీ అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు 18,232కు పరిమితం అయ్యాయి. ఏఐసీటీఈ అనుమతి లభించిన సీట్లలో మూడో వంతు కూడా భర్తీ కాలేదు. పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గిపోవడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. 2020లో వైసీపీ ప్రభుత్వం పీజీ కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంలో చేసిన మార్పులు కాలేజీల పాలిట శాపంగా మారాయి.

ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులను సైతం కేవలం క్యాంపస్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేయడంతో ఉన్నత విద్యకు పేదలు దూరం అయ్యారు. ఫీజులు కట్టలేక కొందరు, క్యాంపస్ కాలేజీల్లో చేరినా మెస్‌ ఫీజులు, ఇతర ఖర్చులు భరించలేక ఇంకొందరు మొత్తంగా పీజీ విద్యకు దూరం అయ్యారు.

డిగ్రీ కోర్సుల్లో ప్రభుత్వం చేసిన మార్పులు కూడా పీజీ అడ్మిషన్లపై ప్రభావం చూపుతోంది. ఏటా నాలుగు లక్షల మందికి పైగా ఇంటర్‌ విద్యార్ధులు బయటకు వస్తుంటే వారిలో సగం మంది కూడా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో సింగల్ మేజర్‌ సబ్జెక్టుతో డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెట్టింది. గతంలో కనీసం మూడు సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండేది.

ఐసెట్‌లో మూడో వంతు సీట్లు భర్తీ…

ఏపీలోని ప్రభుత్వ, అనుబంధ కాలేజీల్లో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2024 అడ్మిషన్ల కోసం మొత్తం 21,480 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 19,665 మంది మాత్రమే అడ్మిషన్లకు కాలేజీ ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. వారిలో 18,232 మందికి సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 62,076 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో 46,454 సీట్లుంటే అందులో సగం కూడా భర్తీ కాలేదు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం