Alluri Sitharama Raju district : విద్యార్థినుల పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన.. విచారణ చేపట్టిన ఎంఈవో
Alluri Sitharama Raju district : క్రీడల్లో పాల్గొనేందుకు విద్యార్థినులను తమిళనాడు తీసుకెళ్లిన పీఈటీ.. అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు అసౌకర్యానికి గురయ్యారు. ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా గొలుగొండ మండలంలో జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. ఇక్కడ పనిచేసే పీఈటీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గురించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1న తమిళనాడులో జాతీయ క్రీడలు జరిగాయి. ఆ పోటీలకు జట్పీ హైస్కూల్ నుంచి సుమారు 10 మంది విద్యార్థినులు వెళ్లారు. వారిని ఆ స్కూల్ పీఈటీ కుందూరి నూకరాజు తీసుకువెళ్లారు.
తిరిగి వచ్చాక..
విద్యార్థినులు వెళ్తున్నప్పుడు వారికి రక్షణగా మహిళ ఉపాధ్యాయురాలిని కూడా పంపాలి. కానీ ప్రధానోపాధ్యాయుడు మహిళ ఉపాధ్యాయురాలిని పంపలేదు. ఇదే అదునుగా పీఈటీ నూకరాజు రెచ్చిపోయాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వారు భరించారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత తమ పట్ల పీఈటీ వ్యవహరించిన తీరును తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి పీఈటీని, ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.
ఎంఈవో విచారణ..
దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన ఎంఈవో సత్యనారాయణ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. అసలేం జరిగిందో విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. పీఈటీ అసభ్యకర ప్రవర్తనపై స్కూల్ కమిటీ సభ్యులు, విద్యార్థినుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంఈవో విచారణ జరిపారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, తల్లిదండ్రులు, విద్యార్థినులతో మాట్లాడి వివరాలను నమోదు చేసుకున్నారు.
డీఈవోకు నివేదిక..
ఈ ఘటనపై ఎంఈవో సత్యనారాయణ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఈ వార్తా వైరల్ అయిందని, దాని ఆధారంగా పాఠశాలకు వచ్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. పీఈటీ నూకరాజు విద్యార్థినుల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవరించినట్లు తేలిందన్నారు. ఈ నివేదికను జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో)కు అందజేస్తానని స్పష్టం చేశారు. తదుపరి చర్యలు డీఈవో తీసుకుంటారని వివరించారు.
బాలికపై అత్యాచారం..
బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరుకు చెందిన నల్లబోతుల కుల్లాయప్ప అనే యువకుడు మాయ మాటలు చెప్పి బాలికను తీసుకెళ్లాడు. ఈ విషయం తెలియని బాలిక తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
పోక్సో కేసు నమోదు..
తమ కుమార్తె కనిపించటం లేదని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం బాలికను పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. బాలికకు మాయమాటలు చెప్పి, ఎత్తుకెళ్లి నల్లబోతుల కుల్లాయప్ప అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కుల్లాయప్పపై శుక్రవారం సాయంత్రం అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేశారు.
నిందితుడికి రిమాండ్..
కుల్లాయప్పను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. ప్రొద్దుటూరు త్రీటౌన్ సీఐ గోవింద రెడ్డి స్పందిస్తూ.. తమకు ఫిర్యాదు అందిందని, దానిపై విచారణ జరపగా బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలిందని చెప్పారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)