Perni Nani Ration Rice Case : గోదాములో రేషన్ బియ్యం మాయం కేసు, పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు
Perni Nani Ration Rice Case : పేర్ని నాని భార్య జయసుధ గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ అధికారుల విచారణలో పేర్ని నాని గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం అయినట్లు గుర్తించారు. ఈ షార్టేజీకి జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు.
Perni Nani Ration Rice Case : రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ...పేర్ని జయసుధకు తాజాగా నోటీసులు జారీ చేశారు. పేర్ని జయసుధకు చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయంపై విచారణ చేపట్టిన ప్రాథమిక విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారులు 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఇందుకు పేర్ని నాని రూ.1.68 కోట్ల జరిమానా చెల్లించారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పౌరసరఫరాల అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా విధించాలని తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని పేర్ని జయసుధకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు ఇచ్చారు.
పోలీసుల అదుపులో పౌరసరఫరాల శాఖ మేనేజర్ కోటి రెడ్డి
మాజీ మంత్రి పేర్ని నాని సతీమణికి చెందిన గోదాములో బియ్యం మాయం కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. గోదాము మేనేజర్ మానస తేజను, కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కోటి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కోటి రెడ్డికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయం ఘటనపై కోటి రెడ్డి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం మాయం అంశంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ కేసులో మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరు- పవన్
పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. గోదాములో రేషన్ బియ్యం మాయమైన విషయం నిజం, డబ్బులు కట్టింది వాస్తవం అన్నారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారి గురించి వైసీపీ నేతలు ఎంతలా తిట్టారో మర్చిపోయారా అని నిలదీశారు. మంగళగిరిలో పవన్ కల్యాణ్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. పేర్ని నాని చేసిన తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
వైసీపీ వ్యవస్థలను నాశనం చేసింది
వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు చెప్పలేకపోతున్నారన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి, పని సంస్కృతిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తొలి 6 నెలలు, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన బేరీజు వేస్తే...ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇప్పటి వరకు పాలన తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు. ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
సంబంధిత కథనం