మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నుండి మాకవరపాలెంకు హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చినట్లు అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా తెలిపారు.
మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడారు. 'విశాఖపట్నం విమానాశ్రయం నుండి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి జగన్ పర్యటన కోసం వైసీపీ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ రహదారిపై ముఖ్యమైన కూడళ్లలో ర్యాలీ, నిరసన నిర్వహించనున్నట్లు సమాచారం. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది.' అని ఎస్పీ అన్నారు.
ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. 'ఇలాంటి సంఘటనలను నివారించడానికి మేం చర్యలు తీసుకుంటున్నందున, ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోకుండా జగన్ విశాఖపట్నం నుండి మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌లో ప్రయాణించేలా చూడాలని మేం వైసీపీ నాయకులను చెప్పాం.' అని ఎస్పీ అన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రోడ్డు మార్గంలో జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించినట్టుగా వెల్లడించారు ఎస్పీ. మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి హెలికాప్టర్‌లో వచ్చేలా అనుమతి ఇచ్చామని తెలిపారు.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు రెండేళ్లు కావస్తుందని, ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోందని జగన్ అన్నారు.
వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని, పూర్తిగా పాలన గాడితప్పిందని ఆరోపించారు. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే ధ్యాస అని చెప్పారు. రాష్ట్ర ఖజనాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని జగన్ మండిపడ్డారు.