పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం : కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ-permission cannot be given for polavaram banakacharla project says central environmental expert committee ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం : కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం : కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ

Anand Sai HT Telugu

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది.

పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉన్నాయని, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలని వెల్లడించింది. పర్యావరణ అనుమతులకు సంప్రదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును చేపట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదికను నిపుణుల కమిటీ పరిశీలన చేసింది. 1983లో గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని వెల్లడించింది. నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులను పరిశీలించాలని పేర్కొంది. పర్యావరణ ప్రభావం మీద అంచనా వేసిన తర్వాత అనుమతి ఇచ్చేందుకు సాధ్యమవుతుందని కమిటీ పేర్కొంది.

బనకచర్ల ప్రాజెక్టుపై అనుమతులు పొందాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సమీక్ష తప్పనిసరి అని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు నివేదికలో లోపాలు ఉన్నాయని, నీటి పంపకాల్లో జీడబ్ల్యూడీటీ తీర్పును ఉల్లంఘించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇటీవలే చంద్రబాబు సమావేశం

ఇటీవలే కేబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు మీద రెచ్చగొట్టే ధోరణి వద్దు అని ఆదేశించారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గురించి వివరించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

స్వాగతించిన హరీశ్ రావు

మరోవైపు ఈ ప్రాజెక్టుకు కేంద్ర నిపుణుల కమిటీ అనుమతులు ఇవ్వలేమని చెప్పాడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సమర్థించారు. సీడబ్ల్యూసీ, జీడబ్ల్యూడీటీ పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు పూర్తి ఆధారాలతో నిలదీయం వల్లనే కేంద్రం దిగివచ్చిందని చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.