AP Midday Meal : ఆకలి తీర్చే ఆశయం.. అమలులో అయోమయం..! పీపుల్స్ పల్స్ విశ్లేషణ-peoples pulse analysis on the implementation of the mid day meal scheme in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Midday Meal : ఆకలి తీర్చే ఆశయం.. అమలులో అయోమయం..! పీపుల్స్ పల్స్ విశ్లేషణ

AP Midday Meal : ఆకలి తీర్చే ఆశయం.. అమలులో అయోమయం..! పీపుల్స్ పల్స్ విశ్లేషణ

HT Telugu Desk HT Telugu

AP Midday Meal : ఓ మారుమూల పల్లెటూరులో పొద్దున్నే లేచిన ఓ విద్యార్థి.. అన్నం తినకుండానే బస్సెక్కి చదువు కోసం కాలేజీకి చేరుకున్నాడు. అతనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం వడ్డిస్తే.. అది చల్లారి, రుచి లేని నీళ్ల కూరతో ఉంది. చేసేదేమీలేక పెట్టిన గుడ్డు తిని, మిగతా భోజనం పారేశాడు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న లోకేష్ (ఫైల్ ఫొటో) (X)

ఈ చిన్న దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1.48 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు.. ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అద్దం పడుతుంది. నిత్య అన్నదాత డొక్కా సీతమ్మ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ మధ్యాహ్న భోజన పథకం.. పేద విద్యార్థుల ఆకలి తీర్చి, వారి ఉన్నత చదువులకు బాటలు వేయాలనే సమున్నత ఆశయంతో రూపొందింది. కానీ, అమలులో అనేక లోపాలు ఆ ఆశయాలను నీరుగారుస్తున్నాయి. ‘విద్య భవిష్యత్కు బీమా’ అనే మాట ఇక్కడ ప్రస్తావించుకోవాలి. నేటి విద్యార్థులు భవిష్యత్‌లో అన్ని రంగాల్లో రాణించాలంటే వారికి పోషకాహారం కచ్చితంగా అందాలని అందరూ గుర్తించాలి.

సంకల్పం గొప్పది..

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలనే ప్రభుత్వ సంకల్పం గొప్పది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పేద విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా.. హాజరు శాతం పెంచడం, డ్రాపౌట్ రేటు తగ్గించడం, విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచడం, సామాజిక సమానత్వం అంశాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ స్థాయికి విస్తరించడం ద్వారా.. పేదరికం వల్ల చదువు మానేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.29.39 కోట్లు, వచ్చే ఏడాదికి రూ.85.84 కోట్ల బడ్జెట్‌లో కేటాయించింది. అయితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు ఆచరణలో ఎంతవరకు నెరవేరుతున్నాయో తెలుసుకోవడానికి పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

పీపుల్స్ పల్స్ సర్వే..

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని 48 కాలేజీల్లో 1200 శాంపిల్స్‌తో సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7, 2025 వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, తల్లిదండ్రులతో తగిన నిష్పత్తిలో చర్చించి సమగ్ర నివేదిక తయారు చేసింది. ఈ సర్వే ప్రకారం.. మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిన తర్వాత హాజరు శాతం 15 శాతం పెరిగినట్లు తేలింది. శ్రీకాకుళంలో ఒక తల్లి.. ‘‘మా అమ్మాయి ఇంట్లో తినకపోయినా కాలేజీలో తింటుందని నమ్మకం’’ అని చెప్పింది. కానీ, ఆమె నమ్మకానికి తగ్గట్టుగా కాలేజీలో భోజనం ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. భోజన నాణ్యత, శుభ్రత, మౌలిక వసతులు, పర్యవేక్షణలో ఉన్న అనేక లోపాలు, సమస్యలు ఈ పథకం లక్ష్యాలను బలహీనపరుస్తున్నాయని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.

నిధుల కొరత పెద్ద సమస్య..

ఈ పథకానికి మొదటి పెద్ద సమస్య నిధుల కొరత! ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒక్కో విద్యార్థి భోజనానికి కేటాయించిన రూ.14.50 ధర దేనికీ సరిపోదు. మార్కెట్లో ప్రస్తుత ధరలు చూస్తే, కూరగాయలు కిలో రూ.40-50, నూనె లీటర్ రూ.130, గ్యాస్ సిలిండర్ రూ.1000 వరకు ఉన్నాయి. ఈ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌తో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యమేనా? అందుకే, కూరలు నీళ్లలా, అన్నం మెత్తగా ఉంటోంది. ఈ నేపథ్యంలో 61.2 శాతం మంది విద్యార్థులు ఇక్కడ తింటున్నామని, 32.5 శాతం మంది అప్పుడప్పుడు తింటామని, 1.3 శాతం మంది అసలు తినడం లేదని చెప్పారు.

ఆకలి పోతోంది..

‘‘అన్నం చూస్తే ఆకలి పోతోంది, గుడ్డు తప్ప ఏదీ తినలేను’’ అని కడపలో రమేష్ అనే విద్యార్థి అన్నాడు. అంటే పరిస్థితి ఎలా ఉందో అంచనాకు రావొచ్చు. ‘‘ఈ డబ్బుతో కూరలు కొనడమే కష్టం, రుచిగా వండడం ఎలా?’’ అని వంట సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. పైగా వంట సిబ్బందికి నెలకు కేవలం రూ.3000 జీతం. అది కూడా ఆరు నెలల బకాయిలు చెల్లించలేదు. గ్యాస్ సిలండర్‌కు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని, అప్పులు తెచ్చి వండుతున్నామని చెప్తున్నారు. పిండికొద్దీ రొట్టె అన్న సామెతలాగా పథకానికి తగిన నిధులు కేటాయించకుండా ఆశించిన లక్ష్యాలు చేరుకోవడం సాధ్యం కాదనేది స్పష్టం.

జీవోలో స్పష్టత ఏది..

రెండో సమస్య జీవో 40లో స్పష్టత లేకపోవడం. సమీప పాఠశాలల్లో వండి కాలేజీలకు తెస్తున్న ఆహారానికి రవాణా ఖర్చులు, పోషకాహార పరిమాణం, తనిఖీ విధానాల గురించి ఈ జీవోలో స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో పాటు అక్షయపాత్ర, ఇతర స్వచ్ఛంద సంస్థలు సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి సరఫరా చేసే ఆహారం కాలేజీకి చేరే సరికి చల్లారిపోతోంది. ప్రతి రోజూ గుడ్డు, ఒకేరకమైన రుచి కలిగిన కూరలు వస్తుండటంతో 66.5శాతం మంది విద్యార్థులు మెనూలో మార్పులు చేయాలని కోరుకుంటున్నారు. ఒకేరకమైన కూరలు చూస్తే విసుగు వస్తోందని, పండ్లు, రాగి జావ ఇస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. మెనూను కూడా సరిగ్గా పాటించడం లేదని విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకాభిప్రాయంగా చెప్పారు. ఈ గందరగోళం వల్ల విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతోంది. 31.4 శాతం కాలేజీల్లో తాగునీరు సరిగా లేదు. 32 శాతం కాలేజీల్లో కూర్చొని తినడానికి సరైన స్థలం లేదు. చాలా చోట్ల నేలపై కూర్చుని తినాల్సి వస్తోంది. శుభ్రత, తాగునీరు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

తనిఖీలు ఎక్కడ..

ఈ పథకంలో మరో ప్రధాన సమస్య పర్యవేక్షణ లోపం. 79.8 శాతం మంది విద్యార్థులు తమ కాలేజీల్లో ఎలాంటి తనిఖీలు జరగడం లేదని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పథకం ప్రారంభించిన రోజు హడావిడి చేశారు తప్ప.. ఆ తర్వాత పట్టించుకోలేదని చెప్పారు. భోజనం విషయంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి విద్యార్థులకు కనీసం ఫిర్యాదు చేసే వ్యవస్థ కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉన్నా.. విద్యార్థి సంఘాలు వ్యక్తిగత ప్రయోజనాలతో బిజీగా ఉండగా, మీడియా ఈ సమస్యలను బయటపెట్టడంలో విఫలమైంది.

చిత్తశుద్ధి చూపాలి..

ఈ పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం మరింత చిత్తశుద్ధి చూపాలి. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.30 కేటాయించి, సన్న బియ్యం, స్థానిక రుచులతో నాణ్యమైన భోజనం అందించాలి. మహిళా సంఘాల ద్వారా కాలేజీల్లోనే వంట వండించడం వల్ల ఆహారం వేడిగా, తాజాగా ఉంటుంది. తమిళనాడులో ఈ విధానం విజయవంతమైంది. ఆకస్మిక తనిఖీలు, టోల్ ఫ్రీ నంబర్‌తో ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ, సోషల్ ఆడిట్లతో పర్యవేక్షణ బలోపేతం చేయాలి. రాష్ట్ర స్థాయి సలహా కమిటీ, కాలేజీ స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేయాలి. డైనింగ్ హాల్స్, తాగునీరు సౌకర్యాల కోసం స్థానిక దాతలను, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించాలి. కేరళలో స్థానిక సంస్థలు ఇలా సహకరిస్తున్నాయి. వంట సిబ్బందికి నెలకు రూ.10,000 జీతం, శిక్షణ, యూనిఫామ్, సకాలంలో బకాయిలు చెల్లించాలి. వారానికోసారి పోషకాహారం గురించి అవగాహన కల్పించాలి. మెనూలో పండ్లు, రాగి జావ, పప్పు రకాలు, పండ్లు జోడిరచి పోషక విలువలు పెంచాలి. ఇది విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వారికి చదువుపై ఆసక్తిని పెంచుతుంది.

ఇతర రాష్ట్రాల్లో..

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్పష్టమైన మార్గదర్శకాలతో మధ్యాహ్న భోజన పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. దక్షిణ కొరియాలో 2011 నుంచి కేజీ నుంచి 11, 12 తరగతుల వరకు ఉచిత భోజనం అందిస్తున్నారు. స్వీడన్‌లో 1946 నుంచి 6-18 సంవత్సరాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఈ ఖర్చును అక్కడి స్థానిక ప్రభుత్వాలే భరిస్తున్నాయి. దీనిని వారు భావితరాల మీద పెట్టే పెట్టుబడిగా చూస్తున్నారు. కాబట్టి, అభివృద్ధి చెందిన దేశాల్లో భోజన పథకాన్ని అధ్యయనం చేసి, మరింత పకడ్బందిగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి.

డొక్కా సీతమ్మ పేరు ప్రతిష్ఠలు పెంచేలా..

డొక్కా సీతమ్మ పేరు ప్రతిష్ఠలను పెంచేలా ఈ పథకం పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా నిలవాలి. ఫథకంలోని లోపాలను సరిదిద్దితే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తోడ్పడుతుంది. తమ భవిష్యత్తుకు పునాది వేసిన ప్రభుత్వాన్ని విద్యార్థులు కూడా గుర్తించుకుంటారు. అలా కాకుండా ఈ పథకం కేవలం ఓట్ల కోసం ప్రచార హంగామాగా మిగిలిపోతే విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ చదువుకు దూరమయ్యే అవకాశాలుంటాయి. ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని విద్యార్థుల భావితరాల పెట్టుబడిగా చూడాలా? లేక ఏదో హడావిడి మొక్కుబడిగా మిగలాలా? అని ఏపీ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి.

జంపాల ప్రవీణ్, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

జంపాల ప్రవీణ్, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.
జంపాల ప్రవీణ్, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు)

HT Telugu Desk