రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఏపీలోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే... లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి.
ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా లబ్దిదారుల్లో సంతృప్తి స్థాయిని అధిక స్థాయిలో పెంచే అవకాశం ఉంది. తద్వారా పథకానికి మరింత జనాదరణ లభించడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఎన్నికల హామీని పకడ్బందీగా అమలు చేస్తోందన్న రాజకీయ లబ్ది ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు దక్కుతుందని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ జరిపిన పైలట్ సర్వే స్పష్టం చేస్తోంది.
ఈ పథకాన్ని రూపాయి అదనపు భారం లేకుండా సంస్కరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. పథకం అమలు, లబ్దిదారుల మనోగతం, వారి సాధకబాధకాలతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణను వారెలా కోరుకుంటున్నారో ఈ సర్వేలో వెల్లడైంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-)పై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సంతృప్తి, సవాళ్లు, మెరుగుదల వంటి వివిధ అంశాలపై పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అధ్యయనం చేసింది.
ఇటువంటి పలు రకాల ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టడం ద్వారా.... ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాస్త్రీయ సర్వే జరిపాము. 500 శాంపిల్స్ తో 2025 మే 5 నుంచి 2025 సర్వే జరిగింది. మే18 వరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మధ్యాంద్ర, గోదావరి జిల్లాల్లో ముఖాముఖి పైలట్ సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది.
పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉచిత గ్యాస్ పథకం ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు అమలు చేయాలా? లేక మార్పు చేయాలా? వంటి ప్రశ్నలను కూడా సంధించారు. నూటికి నూరు శాతం జీరో బిల్లుతో ఫ్రీగా గ్యాస్ సిలిండర్ డెలవరీ చేయాలని మెజార్టీ ప్రజలు కోరారు. ముందుగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించి… ఆ తర్వాత 48 గంటల్లో ఆ డబ్బును ఖాతాలో జమ చేయడం వల్ల ప్రజల్లో ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్’’ పథకం అనుభూతి కలగలేదని ఈ సర్వేలో వెల్లడయ్యింది.
ప్రభుత్వం ఒక సమయానికి డబ్బులు ఖాతాలో వేస్తే…. లబ్ధిదారుడికి గ్యాస్ వేరే సమయంలో బుక్ చేసుకోవచ్చు. దీంతో గ్యాస్ బుక్ చేయడానికి ముందే డబ్బులు వేయడం వల్ల సదరు డబ్బులను ఇతర అవసరాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఖాతాలో డబ్బులు వేయడం వల్ల 30 శాతం మైలేజీ వస్తే... ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే ఖాతాలో డబ్బులు జమ వేయడం వల్ల ఫలితం శూన్యం అని పీపుల్స్ పల్స్ పైలట్ సర్వేలో వెల్లడయింది.
టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ బుకింగ్ కన్న ముందే డబ్బులు వేసినా, ఉచితంగా గ్యాస్ పొందుతున్నామనే అనుభూతి ప్రజలకు కలగదు. ముందుగా ఖాతాలో పడిన డబ్బు ఇతర అవసరాలకు ఖర్చయిపోయి, వాస్తవంగా సిలెండర్ బుక్ చేయాల్సి వచ్చినపుడు సొంత డబ్బు చెల్లిస్తున్న భావనే ఉంటుంది.
లబ్దిదారులు ముందే కట్టిన సిలెండర్ గ్యాస్ డబ్బు 48 గంటల్లోపే తిరిగి చెల్లిస్తుంటే కూడా... మా సర్వేలో పాల్గన్న లబ్దిదారులు చాలామంది తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడం లేదు. అలా తెలుసుకోకపోవడం, డబ్బులు ఖాతాలో ఆలస్యంగా జమ కావడం వంటి అంశాలతో ప్రజల్లో పథకం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. అత్యధిక శాతం ప్రజలు ‘‘నేరుగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తేనే బాగుంటుంది’’ అనే అభిప్రాయం బలంగా వినిపించారు.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తే... గత వైఎస్ఆర్సిపి బాటలోనే కూటమి కూడా నడిచినట్లు అవుతుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
ఉచిత గ్యాస్ సిలిండ్ (దీపం-2) పథకాన్ని మెరుగుపరచడానికి పీపుల్స్ పల్స్ సర్వే కొన్ని సూచనలు చేసింది.