NTR Bharosa Pensions: ఏపీలో రేపు పెన్షన్ల పంపిణీ..పల్నాడు జిల్లా పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు
NTR Bharosa Pensions: ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమంద గ్రామంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీని ఒకరోజు ముందే నిర్వహించనున్నారు. జనవరి 1కు బదులు డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి సాయంత్రంలోగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పెన్షన్ల నగదును వార్డు, సచివాలయాల శాఖ అందచేయనుంది.
డిసెంబర్ 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు. 10.50 గంటలకు నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామానికి చేరుకుంటారు. 11.00 – 11.30 వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 11.35-12.35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12.40-01.00 వరకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు 01.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 02.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
నూతన సంవత్సర ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 1న కాకుండా ముందు రోజే పెన్షన్ల పంపిణీకి అనుమతించాలని కొన్ని రోజులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై స్పష్టత ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రతిపాదన మేరకు డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో 63.75 లక్షల మందికి జనవరి నెలలో రూ.2,717.31 కోట్లను డిసెంబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామునే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత జులై నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ గ్రామ, వార్డుసచివాలయ సిబ్బందితోనే చేపడుతున్నారు.