Mla Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గుండెపోటు, నిలకడగా ఆరోగ్యం!-penamaluru ysrcp mla kolusu parthasarathy suffered with heath attack ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Penamaluru Ysrcp Mla Kolusu Parthasarathy Suffered With Heath Attack

Mla Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గుండెపోటు, నిలకడగా ఆరోగ్యం!

Bandaru Satyaprasad HT Telugu
Jun 10, 2023 04:28 PM IST

Mla Parthasarathy : మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

ఎమ్మెల్యే పార్థసారధి
ఎమ్మెల్యే పార్థసారధి

Mla Parthasarathy : కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గుండెపోటు వచ్చింది. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన పార్థసారథి ఉన్నట్టుండి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను అశోక్ నగర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని గుర్తించారు. అశోక్‌నగర్‌లోని టాప్ స్టార్ ఆసుపత్రిలో పార్థసారథికి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారధికి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పార్థసారథి గుండెపోటుకు గురైన విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని పరామర్శిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు రెండూ ఒకటేనా?

ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (SCA) అనేది సక్రమంగా లేని గుండె లయ కారణంగా తలెత్తే ఒక ప్రాణాంతక పరిస్థితి. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు గుండె కార్యకలాపాలన్నీ ఆకస్మికంగా నిలిచిపోతాయి. శ్వాస ఆగిపోతుంది. వ్యక్తి స్పృహ కోల్పోతాడు, తక్షణమే స్పందించి వీలైనంత త్వరగా చికిత్స చేయకపోతే అది వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. ఎవరైనా వ్యక్తి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కు గురైనప్పుడు అత్యవసర ప్రాథమిక చికిత్సలో భాగంగా ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయాలి. ఇదేకాకుండా వైద్యులు ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) అనే పరికరంతో గుండెకు షాక్‌లు ఇవ్వడం ద్వారా గుండె కార్యకలాపాలు కొనసాగించేలా చేయడం సాధ్యమవుతుంది.

కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు రెండూ ఒకటి కాదు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. మరోవైపు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది రక్త ప్రసరణకు అడ్డుపడటం వల్ల కాదు. గుండె విద్యుత్ చర్యలో మార్పు జరిగి గుండె లయ తప్పినపుడు కలుగుతుంది. అయినప్పటికీ, గుండెపోటు కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు వేగంగా కనిపిస్తుంటాయి, అవి తీవ్రంగా ఉంటాయి.

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు

  • వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలడం
  • పల్స్ లేకపోవడం
  • శ్వాస తీసుకోకపోవడం
  • స్పృహ కోల్పోవడం

కొన్నిసార్లు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఇతర లక్షణాలు

  • ఛాతీలో అసౌకర్యం
  • శ్వాస ఆడకపోవుట
  • బలహీనత
  • గుండె వేగంగా కొట్టుకోవడం, అస్తవ్యస్తంగా కొట్టుకోవడం, గుండె దడగా అనిపించడం
  • మూర్ఛ
  • తలతిరగడం

కొన్నిసార్లు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా కూడా సంభవించవచ్చు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అపస్మారక స్థితిలో ఉండి, శ్వాస తీసుకోని స్థితిలో ఉన్నారని గమనిస్తే వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయండి. ఈలోపు CPR చేయాలి, మీకు అందుబాటులో ఉంటే AED అని పిలిచే ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ కూడా ఉపయోగించండి.

WhatsApp channel