CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు కలెక్టర్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలో జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అధికారాలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. జిల్లాలోని అధికారులు స్వేచ్ఛగా విధులను నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఈ ప్రక్రియపై హెచ్‌ఓడీలు రెండు రోజుల్లో ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా కొత్త జిల్లాల్లో ఎటువంటి సిబ్బంది సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
పని ఒత్తిడికి తగిన విధంగా అధికారులు, సిబ్బందిని కేటాయించాలని సూచించారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు .జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంపద సృష్టించే టూరిజం, ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తన ఆలోచనలు అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రియల్ టైమ్‌లో అమలుపరిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఐదు జోన్‌లు ఉన్నాయన్నారు. జోన్-1 విశాఖపట్నం, జోన్-2 రాజమండ్రి, జోన్-3 అమరావతి, జోన్-4 తిరుపతి, జోన్-5 అనంతపురం పవర్ హబ్‌లుగా ఉన్నాయన్నారు. ఆ పవర్ హబ్ ఆధారంగా ఆయా జోన్లలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే విధంగా కలెక్టర్లు జిల్లా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు పరచాలన్నారు. ప్రతి ఒక్క జోన్‌కు ఒక సీనియర్ అధికారిని ఇన్ ఛార్జ్ గా నియమించామన్నారు.
ఇన్ ఛార్జ్ మంత్రి, జోన్ ఇన్ ఛార్జ్ అధికారి కలిసి జిల్లాలను, ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో సమగ్రంగా చర్చించి క్షేత్ర స్థాయిలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వాస్తవ విషయాలను తెలుసుకుని అందుకు తగిన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలన్నారు. రియల్ టైమ్‌లో సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులు గ్రామాల్లో మూడు, నాలుగు రోజులు ప్యటించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.... సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ ఇజం లేదు, టూరిజమే ప్రధానం అనేవారన్నారు. ఏ ఇజం లేదంటే తమకు కోపం వచ్చేదని, నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అనేవారన్నారు. నాడు చంద్రబాబు చెప్పిన మాటలు నేడు నిజం అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు.
రాష్ట్రంలో ఏ ఇజం లేదని అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడేవారని, ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని అననారు. తన మాటలు, ఆలోచలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని నవ్వుతూ చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని, కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. టూరిజం అభివృద్ధితో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజమేనని సీఎం చంద్రబాబు అన్నారు.
సంబంధిత కథనం