వీర జవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. మురళీనాయక్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీనాయక్ భౌతికకాయానికి మంత్రులు నారా లోకేష్, అనిత, సవిత నివాళులర్పించారు. కళ్లితండాలో మురళీనాయక్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అధికార లాంఛనాలతో మురళి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
యుద్ధంలో అసువులు బాసిన వీరజవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను శనివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని కోరారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్.. కళ్లితండాకు చేరుకుని దంపతులను ఓదార్చారు. అంతకుముందు మహారాష్ట్ర మంత్రి ఉదయ్‌సమంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఉపాధి కోసం మహారాష్ట్రకు వచ్చిన ఆ దంపతులకు.. అక్కడే వ్యాపారం ఏర్పాటు చేసిస్తామని హామీ ఇచ్చారు.
మురళీనాయక్ భౌతికకాయం వద్ద వైసీపీ నేతలు ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్టు చెప్పారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికీ స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 13న జగన్ కళ్లితండాకు వచ్చి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు.
దేశ సరిహద్దులో మురళీ నాయక్ అశువులు బాశడంతో.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. ఉగ్రవాదంపై మన దేశం సాగిస్తున్న పోరుబాటలో వీర జవాన్ సేవలు అందిస్తూ.. అనంత లోకాలకు వెళ్లడంతో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా కళ్లితండా విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలియగానే సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఘటనపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు.
మే 9వ తేదీన తెల్లవారుజామున 2 గంటల సమయంలో మురళీనాయక్ మృతిచెందారని అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ వైపు నుండి జరిగిన భారీ షెల్లింగ్‌లో మురళీ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటన 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా జరిగింది. మురళీ నాయక్ 2022 నవంబర్‌లో అగ్నివీర్ ద్వారా సైన్యంలో చేరాడు. అతను 851 లైట్ రెజిమెంట్‌లో పనిచేశాడు. శిక్షణ అనంతరం మొదట అస్సాంలో, తర్వాత పంజాబ్‌లో విధులు నిర్వర్తించి, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయ్యారు.
మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయి. వారికి మురళీ ఒక్కగానొక్క కుమారుడు. వారు గతంలో ముంబైలో నివసించేవారు. మురళీ నాయక్ మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా ఈ విషాదం జరిగింది.
సంబంధిత కథనం