Janasena Jayakethanam Sabha : ‘కూటమిని నిలబెట్టాం.... జయకేతనం ఎగరేశాం’ - జనసేన అధినేత పవన్ కల్యాణ్
Janasena Formation Day Sabha : దేశమంతా తల తిప్పి చూసేలా వందశాతం విజయంతో ఘన విజయం సాధించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడిన ఆయన… అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్ అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచామని వ్యాఖ్యానించారు.
పిఠాపురంలో చిత్రాడ వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు జనసైనికులు భారీగా హాజరయ్యారు. దీంతో చిత్రాడ అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…. పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్యులు, కొండగట్టు అంజన్నతో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేర్లను ప్రస్తావిస్తూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
జయకేతనం ఎగరవేస్తున్నాం - పవన్ కల్యాణ్
“ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్ అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచాం. దేశమంతా తల తిప్పి చూసేలా వందశాతం విజయంతో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమిని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
“ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయే స్థితిలో ఉన్న నాకు కొండగట్టు అంజన్న దయ, నన్ను ప్రేమించే అభిమాన అన్నదమ్ముల దీవెనలతో నాకు పునర్జన్మను ఇచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా హృదయపూర్వక వందనాలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్య దేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ భీంలు మా జనసేన వీర మహిళలు. రంగులు, ఉత్సాహం తో మైత్రిని పంచే పండుగ హోలీ. చెడు పోయి మంచి వచ్చింది అని రంగులు చల్లుకునే పండుగ హోలీ. మన జయకేతనం ఎగురవేసిన రోజున హోలీ కూడా రావడం యాదృశ్చికం కాదు… ఆ భగవంతుడి నిర్ణయం” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
“నా సినిమాల పేర్లు ఎందుకు అరవొద్దు అంటానంటే… ఏదో తక్కువ చెయ్యాలి అని కాదు. 463 మంది జనసైనికులు సినిమాల కోసం కాదు సిద్ధాంతాల కోసం పాటుపడుతూ చనిపోయారు. వారి గౌరవం మనం కాపాడాలి. ఆవిర్భావ దినోత్సవం వేళ కూటమిలోని టీడీపీ, బీజేపీ పక్షాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ పేర్కొన్నారు.
టీడీపీని నిలబెట్టాం…
‘‘మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు. మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం’’ అని పవన్ వివరించారు.
బహుభాషలే ఉండాలి - పవన్ కల్యాణ్
త్రిభాషా వాదన సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశానికి బహుభాషలే కావాలన్నారు. తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారని… దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయెద్దంటూ వ్యాఖ్యానించారు. మీకు డబ్బులేమో బిహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి కావాలా…? హిందీ మాత్రం వద్దా? ఇదేం న్యాయం….? అని ప్రశ్నించారు.
“ఏ రాష్ట్రంలోని ముస్లింలైనా అరబిక్‌లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దనేే మాటే అనరు. హిందువులు మాత్రం దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు చదవొద్దంటారు. అందుకే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటనలు చేస్తున్నవారు. నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలి” అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత కథనం