Janasena Pawan: ఎమ్మెల్సీ హరిప్రసాద్ కులమేంటో తెలీదు, నాగబాబులో పనితీరు తప్ప బంధుత్వం చూడటం లేదన్న పవన్ కళ్యాణ్
Janasena Pawan: జనసేనలో నాగబాబు పనితీరే ప్రామాణికంగా తీసుకుని పదవులు కేటాయిస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన హరిప్రసాద్ కులమేమిటో తెలియదని, నాగబాబును కూడా పనితీరు ఆధారంగానే గుర్తించి త్వరలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామన్నారు.
Janasena Pawan: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విషయంలో పని తీరే ప్రామాణికంగా తీసుకున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం అని, తమతో పాటు కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, నాగబాబు తన సోదరుడు కాకపోయినా, నాదెండ్ల మనోహర్ వేరే కులానికి చెందిన వ్యక్తి అయినా తాను తీసుకుంటానని చెప్పారు.
నాదెండ్ల మనోహర్ , హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారని, నాగబాబు తనతో సమానంగా పార్టీ కోసం పని చేశారని వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు అంశాలపై పవన్ మీడియాతో ముచ్చటించారు. వారంతా జనసేన పార్టీ కోసం వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పార్టీ కోసం అండగా నిలబడ్డారని గుర్తు చేశారు.
కులం, బంధుప్రీతి అని కాకుండా.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలని, నిజంగా బంధు ప్రీతే కనుక ఉంటే హరిప్రసాద్‌కు కాకుండా నాగబాబుకు మొదట ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడినన్నారు. హరిప్రసాద్‌ది ఏ కులమో తనకు తెలియదని, నాతో పాటు కలిసి పని చేశారా? లేదా? అని మాత్రమే చూస్తానన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న పెదపూడి విజయ్ కుమార్ విద్యార్థి నాయకుడిగా పార్టీలో జాయిన్ అయ్యారని ఇప్పుడాయన మాల కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారని, ఎవరికి ప్రతిభ ఉందో చూసి, వాళ్లకు పదవులు ఇస్తామన్నారు.
జగన్‌ను ఎందుకు అడగలేదు…
నాగబాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి, మళ్లీ తప్పించామని కూటమి పొత్తులో భాగంగా గెలిచే సీటును బీజేపీకి వదులుకున్నామన్నారు. ఆయన త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నా కుదరలేదన్నారు. అందుకే ఎమ్మెల్సీ అనుకున్నామని నాగబాబు త్వరలో ఎమ్మెల్సీగా ఎంపికవుతారని చెప్పారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చిస్తామన్నారు.
బంధుప్రీతి విషయంలో మీడియా ప్రతినిధులు ఎప్పుడూ జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం పవన్‌కల్యాణ్‌ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారని పవన్ ప్రశ్నించారు. బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని ఇప్పుడు తమ తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందని మనతో ప్రయాణం చేసి, పనిచేసిన వారిని గుర్తించాలన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని ఆయన పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చానని రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం అన్నారు.
నెలలో 14 రోజులు జిల్లాల్లోనే…
ప్రజా సమస్యలు తెలుసుకోడానికి పేషీతో సహా జిల్లాల్లో కూర్చోవడం అవసరం అనిపించిందని, ఇందుకోసం నెలలో 14 రోజులు జిల్లాల్లో పర్యటనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉంటేనే ప్రజల సమస్యలను నేరుగా అర్ధం చేసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిద్వారా అధికార యంత్రాంగం పనిలో నాణ్యత ఉండాలని కోరుకుంటున్నానని పునరుద్ఘాటించారు.
• అధికారుల్లో స్పందించే గుణం తగ్గిపోయింది
సినిమా, రాజకీయాలు ఇప్పుడు తన జీవితం లో భాగం అయిపోయాయని పవన్ చెప్పారు. 365 రోజులు పని చేయడానికి సిద్ధమేనని … శని, ఆదివారాలు కూడా క్షేత్ర స్థాయిలో పని అంటే ఉద్యోగులు ఇబ్బందులుపడతారనే ఆలోచన ఉందన్నారు. పనిలో నాణ్యత రావాలి అంటే సెలవులు తీసుకోవచ్చని గత ప్రభుత్వ తీరు వల్ల అధికారుల్లో స్పందించే గుణం తగ్గిపోయిందన్నారు.
• గోటితో పోయేది గొడ్డలి వరకూ తెచ్చారనిపించింది
పుష్ప - 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ సినిమా బృందం అంతా ఒంటరిని చేశారనిపించిందన్నారు. దుర్ఘటన జరిగిన వెంటనే హీరో లేదా ఆ సినిమా టీం బాధితుల కుటుంబం దగ్గరకు వెళ్లి మేమున్నామని, జరిగిన సంఘటన బాధాకరమని ఓదార్పును ఇవ్వాల్సింది. అలా చేసి ఉంటే విషయం పెద్దది అయ్యేదే కాదు. అయితే ఆ పని జరగలేదు. తర్వాత ఒక్కొక్కటిగా జరిగిన విషయాలన్నీ గోటితో పోయేది గొడ్డలి వరకు తెచ్చారు అనిపించింది. సినిమా హీరో తన సినిమాను ప్రత్యక్షంగా తిలకించడానికి థియేటర్ కు వెళ్లాలని అనుకోవడం తప్పు కాదు. అయితే పోలీసులు చెప్పిన భద్రతా విషయాలు పాటించాలి.
అల్లు అర్జున్ సిబ్బంది అయినా జరిగిన దుర్ఘటన గురించి ఆయనకు వెంటనే చెప్పాల్సింది. అదీ జరగలేదు. అల్లు అర్జున్ థియేటర్ బయట ప్రేక్షకులకు అభివాదం చేయడాన్ని తప్పు పట్టను. ఓ సినిమా హీరో అభిమానులకు, ప్రజలకు అభివాదం చేయకపోతే పొగరు లేదా అహంకారం అనుకునే ప్రమాదం ఉంటుంది. అభిమానులు కూడా తమ హీరో అభివాదం చేస్తే ఆనందపడతారని పవన్ అన్నారు.
పోలీసులను కూడా ఈ ఘటన విషయంలో తప్పు పట్టలేనని భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారు ఎప్పటికప్పుడు వీఐపీలను హెచ్చరిస్తూ ఉంటారు. అది వారి విధుల్లో భాగం. సంధ్య థియేటర్ దుర్ఘటన జరిగినపుడు కూడా పోలీసులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించారు. ఇక చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది అనేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఆయన గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినట్లుగా ఎప్పుడూ అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. సినీ పరిశ్రమకు పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చారని పవన్ వ్యాఖ్యానించారు.
దీంతోనే సినిమాల కలెక్షన్లు హైదరాబాద్ లో పెరిగాయని పవన్ వ్యాఖ్యానించారు. పుష్ప వివాదంలో రేవంత్ వ్యక్తిగత, రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ నాయకుడేనని కానీ ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్ కు మినహాయింపునిస్తే తర్వాత చాలా మందికి చట్టం పనితీరు విషయంలో సమాధానం చెప్పుకోవల్సి ఉంటుందనే కోణంలోనే అరెస్ట్ చేశారని నేను భావిస్తాను. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఒంటరి చేశారనిపించింది.
సినిమా టీం సమష్టిగా బాధ్యత వహించాల్సిందిపోయి, కేవలం అల్లు అర్జున్ ను మాత్రమే ముందు పెట్టారనిపించింది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే ఎక్కడో మానవతా దృక్పథం లోపించడం వల్లనే ఈ విషయం గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చిందనిపించిందని పవన్ వ్యాఖ్యానించారు.
పంతం నానాజీ గారి వివాదంలో వెంటనే స్పందించాం.. క్షమాపణ చెప్పించాం
కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఓ దళిత అధికారిపై దూకుడు వ్యవహరించిన ఘటన జరిగిన వెంటనే నేను 15 నిమిషాల్లో స్పందించానని పవన్ గుర్తు చేశారు. జరిగిన విషయాన్ని తాను తెలుసుకున్నానని కేసు కూడా నమోదు చేశారని సదరు అధికారికి ఆ ఎమ్మెల్యే గంటల్లోనే బేషరతుగా క్షమాపణ చెప్పారన్నారు. ఏం జరిగిందో వీడియోలు తెప్పించుకొని మరీ పరిశీలించాను. ఎమ్మెల్యే కోపంలో అప్పటి పరిస్థితుల్లో కాస్త దూకుడుగా వ్యవహరించారని అనిపించింది. వెంటనే ఎమ్మెల్యే పశ్చాత్తాపపడి సదరు వైద్యుడికి క్షమాపణలు చెప్పారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు వెంటనే ప్రజా ప్రతినిధులు, నాయకులు తగు విధంగా స్పందించి బాధితులకు సాంత్వన చేయడం కంటే పెద్ద ఊరట ఏముంటుందన్నారు.