Janasena Pawankalyan: బోటు ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్-pawan kalyan questioned the governments sincerity on the welfare and employment of fishermen ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Pawan Kalyan Questioned The Government's Sincerity On The Welfare And Employment Of Fishermen

Janasena Pawankalyan: బోటు ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Sarath chandra.B HT Telugu
Nov 21, 2023 11:12 AM IST

Janasena Pawankalyan: మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మరోవైపు విశాఖ బోటు ప్రమాద బాధితులకు రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు పవన్ ప్రకటించారు.

మత్స్యకారుల సంక్షేమంపై పవన్ ఆగ్రహం
మత్స్యకారుల సంక్షేమంపై పవన్ ఆగ్రహం

Janasena Pawankalyan: విశాఖ ఫిషింగ్‌ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోటు యజమానులు వారి కుటుంబాలకు పరిహారం అందించనున్నట్లు పవన్ కళ్యాణ‌్ ప్రకటించారు. బాధితులకు జనసేన పార్టీ తరపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రానున్న రెండు మూడు రోజుల్లో తానే స్వయం గా వచ్చి పరిహారం ఇస్తాననని సోషల్ మీడియాలో పవన్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఏపీలో మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం దిశగా అడుగులు వేస్తామన్నారు.

మెరైన్ ఫిషింగ్ కి తగ్గట్లు సుదీర్ఘ తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో, ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కి అనువుగా ఎన్నో జల వనరులు ఉన్నా మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని పవన్ పేర్కొన్నారు.

మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్నారు. గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కి.మీ.లకు ఒక జెట్టీ ఉండటంతో మత్స్యకారుల ఉపాధికీ, వేటకీ సౌలభ్యం ఏర్పడిందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం జెట్టీలు నిర్మిస్తాం... హార్బర్లు కట్టేస్తాం అని మాటలు మాత్రమే ఈ ప్రభుత్వం చెబుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

ముఖ్యమంత్రి అధికార నివాసానికి రూ.451 కోట్లు వెచ్చించేందుకు నిధులు విడుదల చేసే ప్రభుత్వం మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు నిర్మాణానికి మాత్రం ఆసక్తి చూపటం లేదన్నారు.

రుషికొండపై నిర్మితమవుతున్న రాజ మహల్ కోసం చేస్తున్న ఖర్చుతో ఒక హార్బర్ నిర్మించవచ్చని, ఏడు జెట్టీలు నిర్మాణం చేయవచ్చన్నారు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ఉపాధి, సంక్షేమం అనేవి ప్రాధాన్యం కాదని, రుషికొండ కొట్టేసి మహల్ నిర్మించుకోవడమే ముఖ్యం అని తేటతెల్లమవుతోందన్నారు.

మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో సైతం నిబంధనల పేరుతో కోతలు వేస్తున్నారని వలలు, డీజిల్ రాయితీలపైనా శ్రద్ధ లేదన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో హామీలు, శంకుస్థాపనలతో సరిపుచ్చకుండా మత్స్యకారులకు ఉపాధి కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని పవన్ ప్రకటించారు.

ఏపీ మత్స్యకారులు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర లాంటి చోట్లకు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తీర గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపైన, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెడతామని తెలిపారు.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.