Kadapa : వారే నిజమైన హీరోలు, వారిని గౌరవించండి.. చిన్నారులతో పవన్ కల్యాణ్
Kadapa : కడపలో మెగా పేరెంట్ - టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీచర్లే నిజమైన హీరోలని.. విద్యార్థులు వారిని గౌరవించాలని సూచించారు.
పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు సూచనల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'సింహం గడ్డం గీసుకుంటది.. నేను గీసుకొను అని డైలాగులు చెబితే వెనక రీరికార్డింగులు వస్తాయి. సినీ హీరోలు నడిస్తే రీరికార్డింగులు వస్తాయి. కార్గిల్‌లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగులు ఉండవు. కానీ వారే నిజమైన హీరోలు. వారిని గౌరవించండి. హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు, మీ అధ్యాపకుల్లో చూసుకోండి. సినీ నటుడిగా చెప్తున్నా' అని పవన్ వ్యాఖ్యానించారు.
'పాఠశాలలను ఆక్రమిస్తే మీరు గుండా యాక్ట్ కింద కేసులు పెట్టండి. ఆడపిల్లలను ఏడిపిస్తే అధ్యాపకులకు చెప్పండి మా దృష్టికి తీసుకొస్తారు. నిధులు తక్కువ అయినా.. ఈ ప్రభుత్వం మనసు పెద్దది. మీ సమస్యల పరిష్కారాలకు దారులు వెతుకుతాం' అని పవన్ స్పష్టం చేశారు.
'అధ్యాపకులకు ఎక్కువ జీతం వచ్చే రోజు రావాలి. ఎంత వరకు సాధ్యమో తెలీదు కానీ.. నేనైతే ప్రయత్నం చేస్తాను. పౌష్టికాహారం పిల్లలకే కాదు, అధ్యాపకులకు అందాలి. పాపం మాట్లాడి మాట్లాడి ఓపిక అయిపోతుంది. ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉంది. పిల్లల తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి. తీరని సమస్యలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిది. పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని తల్లిదండ్రులు నియంత్రించాలి. చదువుకి, వికాసానికి వాడుతున్నారా చెడు మార్గాల వైపు వెళ్తున్నారా చూస్తూ ఉండాలి' అని డిప్యూటీ సీఎం సూచించారు.
'కడప నుండి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనేది కాదు. దేశం మొత్తాన్ని ఒకేలా చూడాలి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ నుండి వచ్చారు కదా.. ఇక్కడ సమస్యలు ఏమి లేవు అనుకున్నాను. ఇక్కడ తాగు నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉంది అని స్థానిక ఎమ్మెల్యే చెప్పేవరకు తెలీలేదు' అని పవన్ వ్యాఖ్యానించారు.
'ఈ కార్యక్రమానికి కడపని ఎందుకు ఎంచుకున్నాను అంటే.. ఇది ఎక్కువ గ్రంధాలయాలు ఉన్న నేల. చదువుల నేల కడప. సరిగ్గా భోజన సమయానికి నేను మాట్లాడే సమయం వచ్చింది. చిన్న పిల్లలైనా క్షమించండి. కానీ మీ మంచికోసమే కాబట్టి కొంచెంసేపు సమయం వెచ్చించండి' అంటూ పవన్ చిన్నారులను నవ్వించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన "డ్రగ్స్ వద్దు బ్రో" క్యాంపెయిన్ పోస్టర్‌ను పవన్ ఆవిష్కరించారు.