Johnny Master Case : జానీ మాస్టర్‌పై పవన్‌కళ్యాణ్ సీరియస్.. చర్యలకు ఉపక్రమించిన జనసేన!-pawan kalyan orders johnny master to stay away from jana sena party events ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Johnny Master Case : జానీ మాస్టర్‌పై పవన్‌కళ్యాణ్ సీరియస్.. చర్యలకు ఉపక్రమించిన జనసేన!

Johnny Master Case : జానీ మాస్టర్‌పై పవన్‌కళ్యాణ్ సీరియస్.. చర్యలకు ఉపక్రమించిన జనసేన!

Basani Shiva Kumar HT Telugu
Sep 16, 2024 04:50 PM IST

Johnny Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాయదుర్గం పీఎస్‌లో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌పై జనసేన చర్యలకు ఉపక్రమించింది.

పవన్ కళ్యాణ్‌తో జానీ మాస్టర్
పవన్ కళ్యాణ్‌తో జానీ మాస్టర్ (X)

జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్‌ను ఆదేశించింది. జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లో లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అటు జానీ మాస్టర్‌పై కేసు నమోదు అవడంతో.. జనసేన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌‌లో జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్‌ లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పీఎస్‌లో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచాడని ఆరోపించింది. రాయదుర్గం పీఎస్‌లో జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివిధ నగరాల్లో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు.. తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. నార్సింగిలోని నివాసంలోనూ తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. 376, 506, 323 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును నార్సింగ్ పీఎస్‌కు బదిలీ చేశారు రాయదుర్గం పోలీసులు.

2017లో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ వచ్చిందని వివరించింది. 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధితురాలు తెలిపింది. ఒక షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని.. ఆ సమయంలో హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.

జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు జానీ మాస్టర్.. మాజీమంత్రి పేర్ని నానిపై చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. 'పేర్ని నానికి పీర్ల పండగే' అనే డైలాగ్ పొలిటికల్ కాక పుట్టించింది. ఆ తర్వాత కూడా జానీ మాస్టర్ వైసీపీ నేతలపై రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నెల్లూరు తదితర సభల్లో పాల్గొన్నారు. జానీ మాస్టర్‌ను పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు. తాజాగా ఆరోపణలు రావడంతో.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.